కశ్మీర్ కు భారీగా పెరిగిన టూరిజం

0
748

దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి చాలా ఎక్కువగా ఉండడంతో భారతీయులు చల్లగా ఉండే ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా కశ్మీర్ కు వెళ్లడానికి పర్యాటకులు మొగ్గు చూపుతూ ఉన్నారు. దీంతో కశ్మీర్‌ పర్యాటక పరిశ్రమకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తోంది. టూరిజం డైరెక్టర్ జిఎన్ ఇటూ ప్రకారం గత దశాబ్దంలోనే అత్యధికంగా పర్యాటకులు కశ్మీర్ కు వచ్చారు. 2022 మార్చి నెలలో కశ్మీర్ 1.8 లక్షల మంది పర్యాటకులను చూసింది. ఇతర చోట్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో, ఈ సీజన్‌లో ఎక్కువ మంది పర్యాటకులు కశ్మీర్‌కు వెళతారని భావిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రను పునఃప్రారంభించడం ద్వారా పర్యాటక సంఖ్య కూడా బలపడనుంది. కరోనావైరస్ కారణంగా 2020- 2021లో పవిత్ర తీర్థయాత్ర నిలిపివేయబడింది. యాత్ర జూన్ 30న ప్రారంభమై 43 రోజుల పాటు కొనసాగనుంది. “ఇది రికార్డు సంఖ్య.. పర్యాటకులలో మరింత పెరుగుదలను ఆశిస్తున్నాము. ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హౌస్‌బోట్ యజమానులు, పోనీ వాలాస్‌తో సహా అందరి సమిష్టి కృషి కారణంగా రికార్డు స్థాయిలో పర్యాటకుల రాకను అందుకుంది” అని డైరెక్టర్ ఇటూ చెప్పారు.

సెక్రటరీ టూరిజం అండ్ కల్చర్ జమ్మూ & కాశ్మీర్, సర్మద్ హఫీజ్ మాట్లాడుతూ.. ఈ టూరిస్ట్ సీజన్ కోసం భారతదేశంలోని వివిధ నగరాల్లో రోడ్‌షోలు, ప్రమోషన్ క్యాంపెయిన్‌లు నిర్వహించామని తెలిపారు. తులిప్ గార్డెన్, మొఘల్ గార్డెన్స్ వంటి పర్యాటక ఆకర్షణల గురించి చేసిన ప్రచారం కూడా పర్యాటకుల సంఖ్య పెరగడానికి కారణం అయింది. మెజారిటీ హోటల్‌లు, హౌస్‌బోట్‌లు తమ బుకింగ్‌లకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ లు ఇప్పటికే అయ్యాయని, అందువల్ల రాబోయే నెలల్లో మంచి పర్యాటక సీజన్ కొనసాగుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత కశ్మీర్‌లో ఇది మొదటి పూర్తి టూరిస్ట్ సీజన్. గత 2 సంవత్సరాలలో, కేంద్ర పాలిత ప్రాంతంలోని పర్యాటక రంగంపై కరోనావైరస్ ప్రభావం చూపించింది. ప్రయాణాలపై ఆంక్షల కారణంగా తీవ్రంగా నష్టపోయింది.

తీవ్రవాదం లోనూ భారీగా తగ్గుదల:

గత నాలుగేళ్లలో జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదం 45 శాతం తగ్గిందని కేంద్ర హోంశాఖ తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో అనేక ఆందోళనలు వ్యక్తం అయ్యాయని అయినప్పటికీ తమ చర్యలు కశ్మీర్ కు ఎంతో మేలు చేశాయని చెప్పారు. 2018లో జమ్మూకశ్మీర్ లో 417 విద్రోహ ఘటనలు జరగ్గా… 2021 నాటికి అవి 229కి చేరుకున్నాయని తెలిపారు. 2019 నుంచి 2021 మధ్య ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 406 మంది భద్రతా సిబ్బంది, 177 మంది సాధారణ పౌరులు చనిపోయారని తెలిపారు.