షింజో అబే గుండెలోకి దూసుకెళ్లిన తూటా

0
910

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను హత్య చేశారు. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నారా నగరంలో ఈ ఘాతుకం జరిగింది. రక్తపు మడుగులో కుప్పకూలిన అబేను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఓ బుల్లెట్ షింజో అబే గుండెను నేరుగా తాకిందని, దాంతో ఆయన గుండె ఛిద్రమైందని చికిత్స అందించిన డాక్టర్లు వెల్లడించారు. గుండె భాగంలో పెద్ద రంధ్రం పడిందని.. ఆయన మరణానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. దుండగుడు తొలిసారి కాల్చినప్పుడు షింజో అబే కిందపడిపోలేదు.. కానీ రెండో రౌండ్ కాల్చాక ఆయన నేలకొరిగారు.

కాల్పులు జరిపిన వ్యక్తిని 41 ఏళ్ల టెత్సుయా యమగామిగా గుర్తించి, సంఘటనా స్థలంలో పట్టుకుని అరెస్టు చేశారు. తుపాకీతో అబేపై దాడికి పాల్పడ్డాడు.నారా నివాసి యమగామి, జపనీస్ నావికాదళం ‘జపనీస్ మారిటైమ్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్‌’లో గతంలో పని చేశాడు. అతను అబేను కాల్చడానికి ఉపయోగించిన తుపాకీ హ్యాండ్ మేడ్ అని తేలింది. జపాన్ మాజీ ప్రధాని అబే పట్ల అసంతృప్తిగా ఉన్నానని, చంపాలనే ఉద్దేశ్యంతో అతన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు యమగామి తెలిపినట్లు జపాన్ మీడియా సంస్థలు నివేదించాయి.