తెలంగాణకు బుల్‌డోజర్లు వస్తున్నాయి: రాజా సింగ్

0
769

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణకు బుల్‌డోజర్లు వస్తున్నాయని అన్నారు. బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారని, ఇక్కడకూ బుల్ డోజర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో బుల్డోజర్లను ఆర్డర్ చేశామని, అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి అవి దూసుకు వెళతాయని రాజాసింగ్ అన్నారు. సెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఈ ధర్నాలో రాజా సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ ల జోలికి వస్తే ఖబడ్దార్ అని రాజాసింగ్ హెచ్చరించారు. వారిద్దరితో పెట్టుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లు మసైపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

రఘనందన్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారని అడిగామని, తాము తమ స్థానాల్లో నల్ల కండువా వేసుకుని నిల్చున్నామని అన్నారు. అయినా అన్యాయంగా తమను సస్పెండ్ చేశారని రఘునందన్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాము సభలో ఉంటే కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్దాలని నిరూపిస్తామనే తమను సభ నుంచి బయటకు పంపారని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు నాణేనికి బొమ్మా బొరుసులా ఉంటాయన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని.. రాష్ట్ర పార్టీ అనుమతి తీసుకుని తాము ముగ్గురం అన్ని జిల్లాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలు చేపడతామని రఘునందన్ రావు తెలిపారు.

సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగా రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కేసీఆర్ చేసిన మూర్ఖపు మాటలకు వ్యతిరేకంగానూ ఈ నిరసన చేపట్టామన్నారు. తన గొంతును పూర్తిగా నొక్కేయాలని సీఎం కేసీఆర్ యత్నించారని అన్నారు.. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ అహంకారాన్ని ఓడించిన సమయంలో ఆయన నైతిక బాధ్యత తీసుకుని సీఎం పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారని భావించానని అన్నారు. అసెంబ్లీలో తనను చూడకూడదన్నదే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన అని, అందుకే సభ మొదలైన కొద్ది నిమిషాలకే బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని సెషన్ మొత్తం సెస్పెండ్ చేశారని ఈటల అన్నారు. రాష్ట్రంలో అనధికారికంగా కేసీఆర్ తన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. సభా సాంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కి.. బీజేపీ ఎమ్మెల్యేల హక్కులను అణచివేశారని ఈటల అన్నారు. ఈ సమయంలో తమకు మిగిలింది ప్రజా క్షేత్రమేనని, ప్రజల తరఫున కొట్లాడుతామంటే కనీసం దీక్షలు, ధర్నాలకు కూడా ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదని అన్నారు.