Special Stories

నాడు ‘జూతే చార్’.. నేడు ‘జీ హుజూర్’..!
బ్రాహ్మణ ఓటర్లకు మాయవతి గాలం..!!

‘తిలక్, తరాజ్ ఔర్ తల్వార్.. ఇన్కో మారో జూతే చార్’. ఇదీ ఒకప్పుడు బీఎస్పీ ఎన్నికల నినాదం. ఇక్కడ తిలక్ అంటే.. తిలకం ధరించేవాడు.. అంటే బ్రాహ్మణుడు. ఇక, తరాజ్ అంటే వైశ్యుడు, తల్వార్ అంటే క్షత్రియుడని భావం. ‘ఇన్కో మారో జూతే చార్’.. అంటే వారిని చెప్పుతో కొట్టండి అని అర్థం. బీఎస్పీకి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అంటే ఎంత చిన్నచూపో.. ఈ ఎన్నికల నినాదాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

అసలు బీఎస్పీ పుట్టిందే బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం నుంచి. అందుకే, యూపీలో బ్రాహ్మణ, బనియా, ఠాకూర్ల మద్దతు బీఎస్పీకి అనుకున్నంతగా లభించదు. దీంతో 2007లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ బీఎస్పీ రెండు లేదా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, బీజేపీ మద్దతుతో మాయావతి మూడుసార్లు సీఎం కుర్చీ ఎక్కినా.. విపక్ష ఎస్పీ రాజకీయ ఎత్తుగడలతో.. ఎప్పుడూ పూర్తికాలం అధికారంలో నిలవలేకపోయారు. ఐదేళ్లూ పదవిలో వుండాలంటే.. పూర్తి మెజారిటీతోనే సాధ్యమని భావించిన మాయావతి.. కేవలం దళితులను మాత్రమే నమ్ముకుంటే సరిపోదని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో 2007 ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటు బ్యాంకుపై గురిపెట్టారు. పార్టీపై అప్పటిదాకా వున్న బ్రాహ్మణ వ్యతిరేక ముద్రను తొలగించే ప్రయత్నం చేశారు. పార్టీ ఎన్నిక నినాదాన్ని మార్చేశారు. ఈసారి ‘తిలక్, తరాజ్ ఔర్ తల్వార్.. ఇన్కో పూజో బారంబార్’ అంటూ బ్రాహ్మణుల పూజ ప్రారంభించారు. వారి మద్దతుతో ఆ ఎన్నికల్లో సొంతంగా ఫుల్ మెజారిటీ సాధించి.. పూర్తిగా ఐదేళ్లపాటు అధికారంలో వున్నారు. అయితే, 2012లో ఎస్పీ, 2017లో బీజేపీ విజయం సాధించడంతో.. మాయావతి పరిస్థితి మళ్లీ షరామామూలుగా మారింది.

ఇటీవలికాలంలో బీఎస్పీ పూర్తిగా కుదేలైపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే కాదు.. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఈసారి నేరుగా అధికారంలోకి రాకపోయినా.. కనీసం కింగ్ మేకర్ గానైనా నిలవాలని భావిస్తున్నారట మాయావతి. ఆ లక్ష్యంతోనే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగుతున్నారు. ఈసారి కూడా విజయ సంకేతాలు యోగివైపే చూపిస్తున్న నేపథ్యంలో.. మరింత పకడ్బందీగా పోరాడాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా.. బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా వున్న బ్రాహ్మణ వర్గాన్ని తనవైపు తిప్పుకుని.. లాభపడాలని చూస్తున్నారట. అందుకే, బ్రాహ్మణుల వెనుక ‘టెంపుల్ రన్’ మొదలు పెట్టారు. అయోధ్యలో బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించి.. ఏడు నెలల ముందే ఎన్నికల శంఖారావం పూరించారు. అయోధ్యలో ప్రారంభమైన ఈ సమ్మేళనాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. హిందువుల మహా పుణ్యక్షేత్రాలైన కాశి, మథురలో కూడా బ్రాహ్మణ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. మొదట ‘బ్రాహ్మణ సమ్మేళనం’ పేరుతో సమావేశాలు నిర్వహించాలనుకున్నప్పటికీ.. సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో.. సమావేశాలకు ‘జ్ఙానోదయ సమావేశాలు’గా పేరు మార్చారు. ఇప్పటికే హిందువుల ఓట్ల కోసం.. ఎస్పీ, కాంగ్రెస్ చేస్తున్న టెంపుల్ రన్ ప్రారంభించాయి. ఇప్పుడు బీఎస్పీ సైతం బ్రాహ్మణ సమ్మేళనాల పేరుతో అగ్రవర్ణాలకు గాలమేసేందుకు రెడీ కావడం.. యూపీ రాజకీయాలను రసవత్తరంగా మార్చేసింది.

యూపీ జనాభాలో బ్రాహ్మణులు 10 శాతానికి పైనే వున్నారు. ఈ ఓటు బ్యాంకును కొల్లగొట్టే బాధ్యతను.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. పార్టీలో బ్రాహ్మణ వర్గానికి బలమైన ప్రతినిధి అయిన సతీష్ చంద్ర మిశ్రాకు అప్పగించారు మాయావతి. బ్రాహ్మణ సమ్మేళనాలను ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. అధినేత్రి అప్పగించిన బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్న సతీష్ చంద్ర.. ఈ సమ్మేళనాలకు బ్రాహ్మణ ఓటర్ల కోసం కాదని చెప్పేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అయోధ్య ‘జ్ఙానోదయం సమ్మేళనం’ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. మతాన్ని, రాజకీయాన్ని ఒకే గాటన కట్టడం సరికాదన్నారు. అయినా, తమది బ్రాహ్మణ వర్గమని.. తమకు అందరి దేవుళ్లపై నమ్మకం వుందన్నారు. రాముడి ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఇంతకన్నా మంచి ప్లేస్ ఎక్కడుంటుందని ప్రశ్నించారు. ఒకవేళ రాముడి ఆశీర్వాదం బీజేపీ వాళ్లకే ఉంటుందనుకుంటే.. అది వాళ్ల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. రాముడు అందరివాడని.. రాముడి పేరుతో రాజకీయం చేయాలనుకోవడం బాధాకరమని సెలవిచ్చారు. అటు, ఎన్నికల పొత్తులపైనా సతీష్ చంద్ర స్పందించారు. ఈసారి బీఎస్పీ ఒంటరిగా పోటీచేస్తుందని తెలిపారు. తమ పొత్తు ప్రజలతోనేనని తెలిపారు. 2007లోనూ తాము ప్రజా మద్దతుతోనే ఒంటరిగా పోటీచేశామని అన్నారు. నాడు బ్రాహ్మణ సమాజం బీఎస్పీ అండగా నిలబడిందని.. ఐదేళ్లపాటు అధికారంలో వున్నామని గుర్తుచేశారు.

ఇదిలావుంటే, ప్రస్తుతం బీఎస్పీ హిందువుల ఓటు బ్యాంకుపై దృష్టిసారించినప్పటికీ.. ఎన్నికల తర్వాత బీజేపీతో జట్టు కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు రాజకీయ నిపుణులు. నిజానికి, బీఎస్పీ అందుకోసమే ప్రయత్నిస్తోందనే వాదన కూడా లేకపోలేదు. ప్రస్తుతం మాయావతి రాజకీయంగా పూర్తి బలహీన పరిస్థితుల్లో వున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి.. బీజేపీ యూపీలో అసెంబ్లీ, పార్లమెంట్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేస్తూవస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం కుల సమీకరణాలపై ఆధారపడిన బీఎస్పీ లాంటి ప్రాంతీయ పార్టీలు కుదేలవుతూ వస్తున్నాయి. దీంతో, మాయావతి ఈసారి తెగించి పోరాడే అవకాశ వుంది. కఠిన సమయాల్లో ములాయం సింగ్ వంటి రాజకీయ ఉద్ధండులను ఎదుర్కొన్న ఆమె.. ఈసారి హిందుత్వంపై ఆధారపడి తన పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

ఏదేమైనా, అయోధ్య బ్రాహ్మణ సమ్మేళనం ద్వారా.. బీజేపీ ఓటు బ్యాంకుపై గురిపెట్టారు. గతంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కూడా ఈ ఫార్ములాను ఫాలో అయి దెబ్బతిన్నాయి. దేవాలయాల సందర్శన, జన్యుధారీ వంటి వ్యాఖ్యానాలు చేసినా.. అవి బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టలేకపోయాయి. ఈ విషయం బీఎస్పీకి తెలియనిది కాదు.. కానీ, అసెంబ్లీలో అదనపు సీట్లు గెలవడం కన్నా కూడా ప్రస్తుతం.. పార్టీ మనగడే మాయావతికి ముఖ్యం. ఈ దిశగా బ్రాహ్మణ సమ్మేళనాలు పార్టీకి లాభం చేకూర్చుతాయని భావిస్తున్నారు బహెన్ జీ. అలాగే ఒంటరిగా అధికారాన్ని చేజిక్కించుకోలేమని కూడా మాయావతికి తెలుసు. అందుకే, ఎన్నికల తర్వాత ఆమె బీజేపీతో కలిసి వెళ్లే యోచనలో వున్నట్టు తెలుస్తోంది. బీజేపీతో వైరం ఎన్నికల వరకేనని.. తర్వాత కమలనాథులతో కలిసి నడుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడం ద్వారా.. ఈ దిశగా ఆమె గతంలోనే కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని మాయావతి సమర్థించారు. ఆర్టికల్ 370 కి డాక్టర్ అంబేద్కర్ వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. అంతేకాదు, మెహబూబా ముఫ్తి, ఫరూక్ అబ్దుల్లాను గృహనిర్బంధం చేసినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. దీనిని బట్టి హిందుత్వ కార్డుతో ఎన్నికల్లో గౌరవనీయమైన సీట్లను గెలుచుకోవడం.. ఆ తర్వాత బీజేపీతో కలిసి నడవడమే ఆమె లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి, బీఎస్పీ విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి..!

Related Articles

Leave a Reply

Your email address will not be published.

4 × three =

Back to top button