పాకిస్థాన్ మరోసారి తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. భారత్ చేతిలో ఎన్నిసార్లు చావుదెబ్బ తిన్నా బుద్ధిరాని ఉగ్రవాద దేశం.. సరిహద్దుల్లో కవ్విస్తూనేవుంది. తాజాగా పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్ కలకలం సృష్టించింది. ఫిరోజ్‌పూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఓ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. ఫిరోజ్‌పూర్‌లోని గండు కిల్చా గ్రామం సమీపంలో రాత్రిపూట బీఎస్ఎఫ్, పోలీసు సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్ భారత్‌లోకి చొచ్చుకొచ్చింది.
భారత భూభాగంలోకి ప్రవేశించిన అనుమానిత డ్రోన్ కు గమనించిన బీఎస్ఎఫ్ కు చెందిన 136 బెటాలియన్ వెంటనే అప్రమత్తమై.. ఆ డ్రోన్‌ను కూల్చివేసింది. ఈ ఘటన మంగళవారం రాత్రి 11 గంటల 25 నిమిషాలకు ఫిరోజ్‌పూర్‌లోని గండు కిల్చా గ్రామ సమీపంలోని ప్రాంతంలో చోటు చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ ప్రకటించింది. భారత భూభాగంలోకి ప్రవేశించిన అనుమానిత ఎగిరే వస్తువు లేదా డ్రోన్ శబ్దం వినిపించిందని ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. చొరబాటును అడ్డుకునే ప్రయత్నంలో BSF దళాలు డ్రోన్‌పై కాల్పులు జరిపాయని ప్రకటించింది. ఈ క్రమంలో నేలకూలిన హెక్సా-కాప్టర్ ను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. డ్రోన్ తో పాటు, రెండు ప్యాకెట్లలోని 2.5 కేజీల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని BSF దళాలు తెలిపాయి. ఈ ఘటన తరువాత ఆ ప్రాంతంలో భద్రత బలాగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. పాక్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత భద్రత బలగాలు. గత అక్టోబర్ లో అమృత్‌సర్ సెక్టార్‌లోకి ప్రవేశించిన పాక్ డ్రోన్ ను కూల్చివేసిన విషయాన్ని BSF దళాలు గుర్తుచేశాయి.
జమ్మూ, పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా కోసమే పాకిస్థాన్ డ్రోన్లు ఉపయోగిస్తోంది. ఇప్పటివరకు వివిధ ఏకే సిరీస్ అసాల్ట్ రైఫిళ్లు, పిస్టల్స్, ఎంపీ 4 కార్బైన్‌లు, కార్బైన్ మ్యాగజైన్‌లు, హై పేలుడు గ్రెనేడ్‌లతో పాటు మాదక ద్రవ్యాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబరు 15 వరకు పంజాబ్ లోని అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, అబోహర్ ప్రాంతాల్లో BSF దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు దుండగులు హతమయ్యారు.