సరిహద్దులో డ్రోన్ కలకలం.. ఒకరిని పట్టుకున్న భారత సైన్యం..!

0
347

పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని ధనోయ్ ఖుర్ద్ గ్రామంలో సరిహద్దు భద్రతా దళాలు ఓ డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నాయి. అనుమానిత మాదక ద్రవ్యాలను డ్రోన్ ద్వారా ఓ వ్యక్తి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ బ్యాగ్‌తో పాటు ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ అధికారులు తెలిపారు.

భారత్-పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు డ్రోన్‌లను కూల్చివేయడం కొత్తేమీ కాదు. సరిహద్దుల్లో చాలాసార్లు పాక్ నుండి మాదకద్రవ్యాలు, ఆయుధాలను తరలించే ఎన్నో ప్రయత్నాలను భారత సైన్యం అడ్డుకుంది. తాజాగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో బీఎస్ఎఫ్ జవాన్లు పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ జిల్లా దనోయీ కుర్ద్ గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా డ్రోన్ చప్పుడు వినిపించింది. దాంతో అప్రమత్తం అయిన జవాన్లు కాల్పులు జరిపి దానిని కూల్చివేశారు. అనంతరం దానిని గాలిస్తూ ముందుకు వెళ్లారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు గ్రామంలోకి పరిగెత్తారు. అందులో ఒకరిని జవాన్లు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మూడున్నర కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పొలాల్లో కూలిపోయిన డ్రోన్ ను సీజ్ చేసారు.

భారత గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను మే 20న కూడా సైన్యం కూల్చివేసింది. గత నెల ఏప్రిల్ 15న భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో కనిపించిన డ్రోన్‌ను కూడా బీఎస్‌ఎఫ్ కూల్చివేసింది. శనివారం తెల్లవారుజామున 3.21 గంటలకు అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని బచివింద్ గ్రామంలో డ్రోన్ కనిపించింది. 3.2 కిలోల బరువున్న మూడు హెరాయిన్ ప్యాకెట్లను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఏప్రిల్ 13న జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారతదేశం వైపు ఎగురుతున్న డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు కూల్చివేశాయి.