ఓ వైపు భారత్ లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల ప్రయత్నం.. మరోవైపు భారత్ ను దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్ సైన్యం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉగ్రవాద దేశం పాకిస్తాన్ బార్డర్లో కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దుల వద్ద పాకిస్థాన్ ఓ డ్రోన్‌ను పంపి కలకలం రేపింది. పాక్ చర్యలను భారత ఆర్మీ తిప్పికొట్టింది.
జమ్మూకశ్మీర్‌లోని కనాచక్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గగనతలంలో భారత సరిహద్దు దళం సిబ్బంది ఓ డ్రోనును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి గగనతలంలో డ్రోనుకు సంబంధించిన రెడ్ లైట్ వెలుగుతూ కనపడిందని చెప్పారు. దీంతో డ్రోనుపై బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారని వివరించారు. ఆ డ్రోను తోకముడుచుకుని వెనక్కు తిరిగింది. ఈ ఘటనతో కనాచక్ ప్రాంతంలో అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని అధికారులు చెప్పారు. డ్రోన్ల ద్వారా జమ్మూకశ్మీర్‌లోకి పాకిస్థాన్ పేలుడు పదార్థాలు, ఆయుధాలు వంటివి పంపుతోంది.
అయితే సరిహద్దుల్లోకి పదే పదే డ్రోన్లను పంపుతూ పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. పాక్ చర్యలను ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతోంది. గతంలోనూ అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా పాకిస్తాన్ పన్నిన కుట్రను జమ్ముకశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు మోసుకొస్తున్న డ్రోన్ ను భారత్-పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతం కతువాలోని ఓ గ్రామంలో పోలీసులు కూల్చివేశారు. ఏడు మాగ్నటిక్ బాంబులు, ఏడు యూబీజీఎల్ గ్రనేడ్ లాంచర్లను బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. డ్రోన్ కదలికలను రాజ్ బాగ్ పోలీస్ సెర్చ్ పార్టీ గుర్తించింది. వెంటనే కాల్పులు జరిపి డ్రోన్ ను కూల్చివేశారు. అమర్ నాథ్ యాత్ర లక్ష్యంగా బాంబులను తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ మాగ్నటిక్ బాంబులను చార్ దామ్ యాత్ర బస్సులకు అమర్చాలని భావించినట్లు తెలిపారు.
అయితే గతంలో తాలిబన్లు వీటిని వాడేవారు. అమెరికా అధికారులు, ఇతర నాయకుల కార్ల కింద వాటిని పెట్టేవారు. అమెరికాతో శాంతి చర్చల సమయంలో జరిపిన దాడుల్లోనే వీటిని అత్యధికంగా వినియోగించారు. ఈ బాంబులు అమర్చిన కార్లు ఎక్కడో ఒకచోట పేలుతుండేవి. ఇప్పుడు వీటిని అమర్ నాథ్ యాత్రలో ఉపయోగించేలా పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర పన్నుతోంది. గతేడాది కూడా సాంబా సెక్టార్ లో ఇలాంటి బాంబులు దొరికాయి. ఫూంచ్ లో నాలుగు మాగ్నటిక్ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. మళ్లీ తాజాగా ఇవి డ్రోన్ల ద్వారా భారత్ కు చేరుతున్నాయని తెలియడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పగటి సమయాల్లో పంపితే గుర్తు పట్టడంతో రాత్రి వేళల్లో డ్రోన్లను పంపుతున్నట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లోనూ వాటిలో వెలిగే లైట్ల ఆధారంగా గుర్తిస్తున్నట్లు చెప్పారు. అలాగే జమ్ముకశ్మీర్‌లో పోలీసులు మూడు లష్కరే తోయిబా మాడ్యూళ్లను ఛేదించారు. సభ్యులలో ఏడుగురిని అరెస్టు చేశారు. పాకిస్తాన్ నుండి 20 డ్రోన్ సోర్టీల ద్వారా భారత భూమిలో జారవిడిచిన భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి , పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ, సాంబా, కథువా , రాజౌరీ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా జారవిడిచిన ఆయుధాలను కాశ్మీర్‌లోని ఉగ్రవాదులకు సేకరించి రవాణా చేయడానికి ఎల్ఇటి జమ్మూ, రాజౌరి జిల్లాల్లో మూడు టెర్రర్ మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేశారని పోలీసులు చెప్పారు.
ఇక కశ్మీర్లో ఉగ్రవాద గ్రూపులు ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొవడంతోనే డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో ఆయుధాల సరఫరా సాగుతుందని పోలీసు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ముఖ్యంగా జమ్మూలో కనిపిస్తున్నాయి. డ్రోన్ కదలికలు ఎక్కువవడంతో జమ్మూ కశ్మీర్లో భద్రతా సంస్థల అధికారులు అప్రమత్తమై.. నిరంతరం నిఘా పెడుతున్నాయి. తమ యాంటీ డ్రోన్ సిస్టమ్ సామర్థ్యాన్ని, జామింగ్ టెక్నాలజీని విస్తరించాయి. ఈ ఏడాది జమ్మూ డివిజన్లో మానవ రహిత విమానాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉన్నట్టు మిలిటెన్సీ చెబుతోంది. రెండు ప్రాంతాల్లో డ్రోన్ల నుంచి భద్రతా సంస్థలు భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్న ఘటనలతో భారత ఆర్మీ సైతం ప్రత్యేక నిఘా పెట్టింది.