మొదట 11 బోట్లను పట్టుకున్నారు.. ఆ తర్వాత పలువురు పాకిస్తానీలను అరెస్టు చేసిన బీఎస్ఎఫ్

0
990

గుజరాత్‌లో పాకిస్తాన్ చొరబాట్లను భారత్ ఎప్పటికప్పుడు అణిచివేస్తూ ఉంది. తాజాగా సరిహద్దు భద్రతా దళం (BSF) భుజ్ యూనిట్ భుజ్‌లోని హరామి నల్లాలోని క్రీక్ ప్రాంతంలో 6 మంది పాకిస్తానీ జాతీయులను పట్టుకుంది. పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ల చొరబాటును BSF గుర్తించి వాటిలో కనీసం పదకొండు మందిని స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత ఇది జరిగింది. ఆ ప్రాంతంలో పాక్ బోట్లను గుర్తించిన బీఎస్ఎఫ్ చొరబాటుదారుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

BSF విడుదల చేసిన ప్రకటనల ప్రకారం.. హరామి నల్లా ప్రాంతంలో డ్రోన్ నిఘా ద్వారా BSF భుజ్ యూనిట్ పాకిస్తాన్ పడవలను గుర్తించింది. BSF భుజ్ యూనిట్ భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ‘క్రీక్ క్రోకోడైల్ కమాండోస్’ కు చెందిన ప్రత్యేక విభాగాన్ని మోహరించింది. భుజ్‌లోని క్రీక్ ప్రాంతంలో దాక్కున్న పాకిస్తానీలను వెతకడానికి భారత వైమానిక దళం హెలికాప్టర్ నుండి క్రీక్ క్రోకోడైల్ కమాండోలను మోహరించారు. చొరబాటుదారులు దాక్కున్న ప్రదేశాన్ని మూసివేయడానికి మూడు వేర్వేరు దిశల నుండి భారత వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా మూడు గ్రూపుల కమాండోలను ఆకాశంలో గస్తీ కాయించామని BSF తెలిపింది.

బుధవారం కమాండోలు ఎనిమిది బోట్లను, గురువారం మరో మూడు బోట్లను సీజ్ చేశారు. పాకిస్తాన్ జాతీయులు దాక్కున్న చోటును కమాండోలు ముట్టడి చేశారని బీఎస్ఎఫ్ గుజరాత్ తన ట్వీట్‌లో పేర్కొంది. “తీవ్రమైన చిత్తడి ప్రాంతం, మడ అడవులు, అలలు సైనికుల పనిని సవాలును విసిరినా పట్టుకోవడంలో భారత సైన్యం సఫలమైంది” అని అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం 30 గంటల పాటూ ఆపరేషన్ కొనసాగింది. గాంధీనగర్ నుంచి కచ్ చేరుకున్న ఐపీఎస్, ఐజీ బీఎస్ఎఫ్ గుజరాత్ ఫ్రాంటియర్ జీఎస్ మాలిక్ ఈ భారీ సెర్చ్ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు.