More

    రిపబ్లిక్ డే అలర్ట్: యాంటీ టన్నెల్, యాంటీ డ్రోన్ ఆపరేషన్స్ చేపట్టిన బీఎస్ఎఫ్ ద‌ళాలు

    రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా సంఘ విద్రోహ శ‌క్తులు దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశాలు ఉన్న నేప‌థ్యంలో దేశ స‌రిహ‌ద్దుల్లో బీఎస్ఎఫ్ ద‌ళాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. రెండు వారాల పాటు స‌రిహ‌ద్దుల్లో గ‌స్తీ తీవ్ర స్థాయిలో ఉంటుంద‌ని ఇప్ప‌టికే బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ ప్ర‌క‌టించింది. జ‌మ్మూలో ఉన్న ఇంట‌ర్నేష‌న‌ల్ బోర్డ‌ర్ వ‌ద్ద యాంటీ ట‌న్నెల్ ఆప‌రేష‌న్స్ చేప‌ట్టిన‌ట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఎటువంటి ఉగ్ర చ‌ర్య‌ను అడ్డుకోవ‌డానికైనా బీఎస్ఎఫ్ రెఢీగా ఉంద‌న్నారు.

    రిపబ్లిక్ డే వేడుకలకు ముందు భద్రతా ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని సరిహద్దు భద్రతా దళం జమ్మూ ఫ్రాంటియర్ లో నిఘాను తీవ్రతరం చేసింది. తన దళాలను బలోపేతం చేసింది. భద్రతా ముప్పు గురించి మరొక హెచ్చరికను జారీ చేస్తూ, జమ్మూ ఫ్రాంటియర్ BSF ఐజీ డీకే బూరా మాట్లాడుతూ, “గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యతిరేక శక్తులు ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉందని మాకు ఇన్‌పుట్‌లు అందాయి. సరిహద్దు వెంబడి నిఘా పెంచాం. సరిహద్దు వెంబడి గరిష్ట సంఖ్యలో సైనికులు మోహరించాము. యాంటీ టన్నెల్, యాంటీ డ్రోన్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఉగ్రవాదులు, దేశ వ్యతిరేక శక్తులు విజయవంతం అవ్వలేవు” అని చెప్పుకొచ్చారు. గత కొన్ని నెలలుగా పెరిగిన డ్రోన్ కార్యకలాపాలు పెరిగిన నిఘా కారణంగా క్షీణించాయని ఆయన అన్నారు. “జమ్మూ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన BSF దళాలు గత సంవత్సరంలో పాకిస్తాన్ చొరబాటుదారులను నిర్మూలించడం, భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం.. సొరంగాలను గుర్తించడం ద్వారా సరిహద్దు వద్ద తీవ్రవాదుల ప్రయత్నాలను విఫలం చేయడంలో విజయవంతం అయ్యాయి” అని BSF పేర్కొంది.

    గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రముఖులకు ముప్పు పొంచి ఉందని తొమ్మిది పేజీల ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ కొద్దిరోజుల కింద వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం నోట్ పేర్కొంది. ఈ తీవ్రవాద గ్రూపులు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని, బహిరంగ సభలు, కీలకమైన సంస్థలు, రద్దీగా ఉండే ప్రదేశాలలో విధ్వంసం సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

    Trending Stories

    Related Stories