రాజస్థాన్ రాష్ట్రంలోని భారత్-పాకిస్థాన్ బోర్డర్ లో 270 కోట్ల విలువైన డ్రగ్స్ ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్) సిబ్బంది పట్టుకుంది. పాకిస్థాన్ కు చెందిన స్మగ్లర్లు భారత్ లోని స్మగ్లర్లకు డ్రగ్స్ ను చేరవేస్తుండగా బిఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించి సీజ్ చేసింది. 56 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 270 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. జూన్ 2-3 తేదీల మధ్య ఈ ఘటన చోటు చేసుకుందనే సమాచారాన్ని అధికారులు మీడియాకు తెలిపారు. కొందరు అనుమానంగా సరిహద్దు ప్రాంతంలో తిరుగుతూ ఉండగా.. వారిని బిఎస్ఎఫ్ జవాన్లు చూశారు. వెంటనే వారిని వెంబడించారు. బిఎస్ఎఫ్ జవానులు కాల్పులు జరపగా.. డ్రగ్స్ ప్యాకేజీని అక్కడే వదిలేసి స్మగ్లర్లు పారిపోయారు.

బికనీర్ లోని బండ్లీ బోర్డర్ పోస్టు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 54 ప్యాకెట్ల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నామని బిఎస్ఎఫ్ అధికారి తెలిపారు. రాజస్థాన్ సెక్టార్ లో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ కు చెందిన స్మగ్లర్లు భారత్ లోకి డ్రగ్స్ ను చేరవేయాలని అనుకున్నారని.. వారి ఆటలను భారత భద్రతా బలగాలు సాగనివ్వలేదని తెలిపారు. బిఎస్ఎఫ్ డిఐజి పుష్పేంద్ర రాథోర్ మాట్లాడుతూ డ్రగ్స్ స్మగ్లర్లు పీవీసీ పైపులను ఉపయోగించి హెరాయిన్ ప్యాకెట్లను తరలించాలని అనుకున్నారని.. అయితే వారి ప్రయత్నం సఫలం కాలేదని తెలిపారు. పాకిస్థాన్ నుండి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు భారత్ లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు బిఎస్ఎఫ్ సిబ్బంది ఈ డ్రగ్స్ ముఠాలకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది. రాజస్థాన్-పాకిస్థాన్ బోర్డర్ లో గతంలో కూడా డ్రగ్స్ పట్టుబడ్డాయి కానీ.. ఇంత పెద్ద మొత్తంలో మాత్రం పట్టుబడలేదు.