మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తమ్ముడి మృతిని తట్టుకోలేని అన్న బోరున విలపిస్తూ గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఉదంతంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది. మృతులు లక్సెట్టిపేట పట్టణానికి చెందిన గాజుల భాస్కర్ గౌడ్ (47), జగిత్యాల జిల్లాకు చెందిన అతని సోదరుడు శ్రీనివాస్ గౌడ్ (55) అని అధికారులు తెలిపారు. వీరిరువురు వృత్తిరీత్యా వ్యాపారులు. భాస్కర్ గౌడ్ ఉదయం 5 గంటల ప్రాంతంలో జాగింగ్ చేస్తుండగా.. గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అన్నయ్య శ్రీనివాస్ ఉదయం 8 గంటలకు లక్సెట్టిపేటకు చేరుకున్నాడు. మృతదేహాన్ని చూసి షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని ధర్మపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు గంటల వ్యవధిలో గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది.