ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఇప్పటికే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. ఇటీవల ఆమె భర్త అనిల్ చేస్తున్న పర్యటనలు హాట్ టాపిక్ గా మారాయి. పలువురు రాజకీయ నాయకులను బ్రదర్ అనిల్ కుమార్ కలవడంపై చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే షర్మిల పార్టీ వెనక ఉన్నది అనిల్ అనే ప్రచారం కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు ఏపీలో ఆయన పాల్గొంటున్న చర్చలు, మీటింగ్ ల కారణంగా పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం సాగుతూ వచ్చింది. సోమవారం నాడు కొన్ని మీడియా సంస్థలు ఆయన ఏకంగా పొలిటికల్ పార్టీ పెట్టేస్తున్నారంటూ కొత్త వాదన తీసుకుని వచ్చాయి. ఇటీవలే రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా బ్రదర్ అనిల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. సోమవారం విజయవాడ వచ్చిన అనిల్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో పాటు పలు బీసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మీటింగ్ అయ్యాక బ్రదర్ అనిల్ కు మీడియా చుట్టుముట్టగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ కోసం పనిచేసిన క్రైస్తవులు ఇప్పుడు తీవ్ర ఆవేదనతో ఉన్నారని.. ఇటీవలే తనతో భేటీ అయిన కొందరు క్రైస్తవులు ఇదే మాటను తనతో చెప్పారని కూడా అనిల్ తెలిపారు. ఏపీ వేదికగా తాము కొత్త పార్టీ పెడుతున్నామన్నది పూర్తిగా సత్యదూరమని. అదంతా అసత్య ప్రచారమేనని తెలిపారు. ఉండవల్లితో వేరే విషయాలను చర్చించామని, ఏదైనా ఉంటే తానే స్వయంగా వివరాలు వెల్లడిస్తానని అనిల్ తెలిపారు.
తమను సీఎం జగన్ కలవకపోవడంతో బ్రదర్ అనిల్‌కు మా సమస్యలు తెలిపామని, మరో రెండు మూడు రోజుల్లో మరోసారి బ్రదర్ అనిల్‌లో భేటీ అయి కార్యాచరణ సిద్ధం చేస్తామని ఎస్సీ వర్గాలు తెలిపాయి. కుటుంబపాలన వద్దని, ఏపీలో మార్పు రావాలని జగన్ పార్టీకి ఓటేసి గెలిపించామని, బీసీ సమస్యల గురించి సీఎం జగన్‌కు విన్నవించుకుందామంటే కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొన్నదని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు చెప్పారు. గతంలో బ్రదర్ అనిల్ రహస్యంగా సమావేశం పెట్టి జగన్‌కు ఓటేయాలని చెప్పడం వల్లనే వైసీపీ పక్షాన నిలిచామని ఆయన స్పష్టం చేశారు.