More

    ఆ పిల్లాడికి ఉన్న జ్ఞానం కూడా పర్యాటకులకు లేదాయె..!

    భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ ఉండడంతో ప్రభుత్వం మినహాయింపులు ఇస్తూ వస్తోంది. దీంతో పలు పర్యాటక ప్రాంతాలు రద్దీగా మారిపోయాయి. కొద్దిరోజుల కింద హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీలో జనం కిక్కిరిసిపోయి ఉండడం చూసి అందరూ షాక్ తిన్నారు. రూమ్స్ అన్నవి కనీసం దొరకలేదు.. సామాజిక దూరం లేకుండా ప్రజలు నిలబడి ఉండడం.. మాస్కులు ధరించకుండా ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. హిమాచల్ లోని పర్యాటక ప్రాంతాలైన మనాలి, సిమ్లా, కులు-మనాలి, ధర్మశాల వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. కరోనా నిబంధనలు అసలు పట్టించుకోలేదు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కరోనా థర్డ్ వేవ్ కు హిమాచల్ పర్యాటకులు బాటలు వేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా తిరుగుతుండడం పట్ల కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది కరోనా థర్డ్ వేవ్ కు దారితీయొచ్చని, పర్యాటకులను గుంపులుగా తిరగనివ్వరాదని పేర్కొంటూ కేంద్రం ఇవాళ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సిమ్లా, మనాలి వంటి పర్యాటక ప్రదేశాల్లో యాత్రికులు కరోనా మార్గదర్శకాలు పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ వెళ్లే బయటి వారికి ఆర్టీ-పీసీఆర్ టెస్టు తప్పనిసరిగా ఉండేది. అయితే, తాజాగా కొవిడ్ సంబంధిత ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు ఆర్టీ-పీసీఆర్ నిబంధన కూడా తొలగించింది. దాంతో హిమాచల్ ప్రదేశ్ కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఒక్కసారిగా టూరిస్టుల తాకిడి పెరగడం కరోనా ముప్పును మరింత పెంచుతుందని కేంద్రం తన లేఖలో హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకుల తీరుపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తీవ్రంగా స్పందించారు.

    ఇలాంటి తరుణంలో మాస్కులు ఎక్కడ అంటూ ఓ పిల్లాడు పర్యాటకులను అడుగుతూ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఓ పిల్లాడు ప్లాస్టిక్ లాఠీని పట్టుకుని మాస్కులు పెట్టుకోని వారిని ప్రశ్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ధర్మశాలలోని ఓ మార్కెట్లో రికార్డు చేసినట్లు తెలిసింది. సుమారు ఆరేళ్ల వయస్సు గల పిల్లాడు.. అటుగా మాస్కులు లేకుండా వస్తున్న వ్యక్తులను.. మాస్కులు పెట్టుకోండి? మీరు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు? అంటూ ప్రశ్నించడమే కాకుండా.. తన చేతిలో ఉన్న ప్లాస్టిక్ లాఠీతో కొట్టడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పిల్లాడు మాస్కు పెట్టుకోండని కోరుతుంటే.. ఎగతాళిగా నవ్వారు కొందరు. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు సైతం ఆ పిల్లాడిని ప్రశంసలతో ముంచెత్తారు. పెద్దలకు ఏ మాత్రం బుద్ధిలేదని.. పిల్లాడికి ఉన్న జ్ఞానం కూడా వీళ్లకు లేదని స్పష్టమైందని నెటిజన్లు చెబుతూ ఉన్నారు.

    Related Stories