Telugu States

పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స

ఇటీవలి కాలంలో పలువురు వైసీపీ నేతలు పార్టీని వీడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! మరికొందరు నేతలు పరిస్థితులను బట్టి పార్టీ నుండి జంప్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వైసీపీలో ఏదో జరుగుతోందనే అనుమానాలు మాత్రం రేకెత్తుతూ ఉన్నాయి.

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో జరిగిన జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తల్లో, నాయకుల్లో మనస్పర్థలు ఉంటే చర్చించుకుందామని అన్నారు. వీలైనన్ని పరిష్కరించుకుందాం.. అంతే తప్ప అభిప్రాయ భేదాలతో పార్టీని నాశనం చేయొద్దని సూచించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా మాకేమీ కాదు.. గ్రామస్థాయిలో, మండల స్థాయిలో మీకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో రెండో ఆలోచన మొదలైందని.. పక్క చూపులు చూడొద్దన్నారు. ఒకవేళ అదే నిజమైతే అందరం నష్టపోక తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పనితీరు బాగుందని అందరూ చెబుతున్నారని, దానిని మనం నిలబెట్టుకోవాలని సూచించారు. పార్టీలో నెలకొన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు.

Related Articles

Back to top button