రిషి సునాక్‎పై బోరిస్ కుట్రలు.. బ్రిటన్ ప్రధాని కాకుండా అడ్డుపుల్ల..!

0
880

బ్రిటన్‌ కొత్త ప్రధాని ఎవరో సెప్టెంబర్‌ 5న తేలనుంది. ఆ రోజు కొత్త ప్రధానిని ఎంపిక చేయాలని నిర్ణయించింది అధికార కన్జర్వేటివ్ పార్టీ. ప్రధాని పదవికి పోటీ పడాలనుకునే వారికి కనీసం 20 మంది తమ సహచర ఎంపీల మద్దతు ఉండాలి. ఈ మద్దతును సంపాదించుకున్న రిషి సునాక్‌ అప్పుడే తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

భారత సంతతికి చెందిన రిషి ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ నారాయణమూర్తికి అల్లుడు. ప్రధాని రేసులో ముందున్న రిషికి బ్రిటన్‌ రవాణా మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ మద్దతు లభించడం విశేషం. గ్రాంట్‌ తాను పోటీ నుంచి విరమించుకుని రిషికి మద్దతు ఇస్తున్నట్టు అనౌన్స్‌ చేశారు. మొన్నటివరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు రిషి. బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్ నుంచి మొదట తప్పుకున్నది కూడా రిషినే. ఆ తర్వాతే ఇతర మంత్రులు రాజీనామా చేశారు.

తొలి రెండు రౌండ్ల ఓటింగ్‌లో రిషి సునాక్‌ అత్యధికమంది ఎంపీల మద్దతుతో ముందంజలో నిలిచారు. రిషి సునాక్‌ మిగతా పోటీదారుల కంటే ఎక్కువగా 101 ఓట్లు సాధించారు. పెన్నీ మోర్డౌంట్‌ 83 ఓట్లు, లీజ్‌ ట్రస్‌ 64 ఓట్లు, కెమి బడెనోష్‌ 49 ఓట్లు, టామ్‌ టుగెంధట్‌ 32 ఓట్లు సాధించారు. తొలిరౌండ్‌ తర్వాత 11 మంది పోటీలో ఉండగా.. రెండో రౌండ్ ముగిశాక ప్రధాని రేసులో ఐదుగురు మాత్రమే మిగిలారు. పలు రౌండ్ల అనంతరం కన్జర్వేటివ్‌ పార్టీ లీడర్‌ను ఎన్నుకోనున్నారు. పార్టీ లీడర్‌గా ఎవరు నిలుస్తారో వారే బ్రిటన్‌ ప్రధాని పదవిని చేపట్టనున్నారు. ఈ సయయంలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ప్రధానమంత్రి కాకుండా అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ ప్రధాని ఎన్నికలో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ను ఎలాగైనా ఓటమిపాలు చేసేందుకు తాత్కాలిక ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కుట్ర చేస్తున్నారని మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్‌ తప్ప.. మరెవరికైనా మద్దతు తెలపండి అంటూ బోరిస్ జాన్సన్‌ ఎంపీలకు సూచించినట్టు తెలుస్తోంది.

అయితే, రిషి సునాక్ తనకు ద్రోహం చేశారని, ఆయన కారణంగానే సొంత పార్టీ నేతలు కూడా తనకు దూరమయ్యారని, దీంతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని బోరిస్‌ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో తలదూర్చబోనని, బరిలో ఉన్న ఏ అభ్యర్థినీ బలపరచనని జాన్సన్‌ బహిరంగంగా వెల్లడించినప్పటికీ.. సునాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని కాకూడదంటూ తన మద్దతుదారులతో ఆయన మంతనాలు సాగిస్తున్నట్టు అక్కడి వార్త సంస్థ ప్రచురించింది. విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ లేదంటే జాకబ్‌ రీస్‌, డోరిస్‌, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని బోరిస్ జాన్సన్ సూచించినట్టు చెప్పింది. 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ రిషిని వ్యక్తిగతంగా ద్వేషిస్తోందని, బోరిస్‌ను పదవి నుంచి తప్పించేందుకు సునాక్‌ కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేసినట్టు భావిస్తోందంటూ కథనంలో వెల్లడించింది.

అయితే వరుస కుంభకోణాలతో జాన్సన్‌ ప్రతిష్ట మసకబారింది. మరోవైపు దడ పుట్టిస్తున్న ద్రవోల్బణం, అప్పుల భారం, కుంటుపడిన ప్రగతి.. బ్రిటన్‌ ఎకానమీకి గుదిబండగా మారాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్‌, ఇతర మంత్రుల రాజీనామాలతో జాన్సన్‌ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. రిషితో పాటు 11 మంది ప్రధాని పదవికి పోటీలో నిలిచారు. పోటీలో ఉన్నవారిని పార్టీ నేతలు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. రౌండ్ల వారీగా ఓటింగ్ నిర్వహించి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. చివరకు మిగిలిన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే కన్జర్వేటివ్ పార్టీ కొత్త సారథిగా, ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four + 15 =