దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. ఘాజీపూర్ పూల మార్కెట్ లో బాంబు ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి మార్కెట్ లో అణువణువు తనిఖీలు చేపట్టారు. ఐఈడీ పేలుడు పదార్థాలతో కూడిన ఓ బ్యాగును గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కు, ఎన్ఎస్ జీకి సమాచారం అందించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. హుటాహుటీన మార్కెట్ వద్దకు చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఎన్ఎస్ జీ బలగాలు ఆ బ్యాగులోని బాంబును నిర్జన ప్రదేశానికి తరలించి అక్కడ పేల్చివేశాయి. సకాలంలో బాంబును గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది.
తూర్పు ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్ సమీపంలో అనుమానాస్పద సంచి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంచిలో బాంబును గుర్తించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు సమాచారం ఇవ్వడంతో వారు ప్రత్యేక వాహనంలో వచ్చి బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిర్వీర్యం చేశారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు. దీనిపై ఢిల్లీ స్పెషల్ పోలీసు విభాగం కేసు నమోదు చేసింది. బాంబు పెట్టింది ఎవరనే విషయమై దర్యాప్తు మొదలైంది.
ఘాజీపూర్ ఫ్లవర్ మార్కెట్‌లో దొరికిన ఐఈడీ ఉన్న బ్యాగ్ ఫోటోను కూడా ఏజెన్సీలు పంచుకున్నాయి. అందిన సమాచారం ఆధారంగా ఐఈడీని స్వాధీనం చేసుకున్నట్లు రాకేష్ అస్థానా తెలిపారు. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు కొన్ని రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. “పేలుడు పదార్థాల చట్టంలోని నిబంధనల ప్రకారం ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌లో కేసు నమోదు చేయబడుతుంది” అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐఈడీని గమనించిన స్థానిక వ్యక్తి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాడు. వార్తా సంస్థ IANS నివేదిక ప్రకారం, ఢిల్లీ అగ్నిమాపక శాఖకు ఉదయం 10.20 గంటలకు అనుమానాస్పద బ్యాగ్ గురించి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే రెండు అగ్నిమాపక యంత్రాలు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రోబోటిక్ స్కానర్ సహాయంతో బ్యాగ్‌ని స్కాన్ చేశారు. అనుమానాస్పద బ్యాగ్‌ను ఓపెన్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి ఎనిమిది అడుగుల భూమిలోపల గొయ్యిలో పాతిపెట్టినట్లు అధికారులు తెలిపారు. “నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌కు చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఘాజీపూర్ నుండి స్వాధీనం చేసుకున్న IEDని నిర్వీర్యం చేసింది. IED నమూనాలను సేకరించారు. పేలుడు పదార్థాన్ని సమీకరించటానికి ఉపయోగించే రసాయన భాగాలపై నివేదికను సమర్పించనున్నారు” అని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధికారులు చెప్పారు.