అఫ్గానిస్థాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఉత్తర సమంగాన్ ప్రావిన్స్ లోని అయ్బాక్లోని ఓ మదర్సాలో జరిగిన ఈ దుర్ఘటనలో 10మంది చిన్నారులు సహా మొత్తం 16మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రజలు సామూహిక ప్రార్థనల నుండి బయటకు వస్తుండగా పేలుడు సంభవించిందని, బాధితుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులేనని స్థానిక ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. దేశ రాజధాని కాబుల్ కు 200 కిలోమీటర్ల దూరంలోని అయ్బాక్ నగరంలో పేలుడు జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ పేలుడు ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్గానిస్థాన్ లో సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి.