ఆఫ్ఘనిస్థాన్ లో కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. కాబూల్ విమానాశ్రయం గేటు వద్ద భారీ పేలుడు సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడేనని అమెరికా రక్షణశాఖ భావిస్తోంది. 13 మంది దాకా మరణించారని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు రక్షణశాఖ వర్గాలు సమాచారం అందించాయి.
కాబూల్ ఎయిర్‌పోర్ట్ బయట సంభవించిన ఈ పేలుడులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సంఘటనకు ముందు ఇటలీ జెట్‌కు నిప్పంటుకుంది. పేలుడు సమయంలో విమానాశ్రయంలో వేలాదిమంది ఉన్నారు. ఈ సంఘటనతో విమానాశ్రయంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. భారత్ కూడా తాజా పరిణామాలను సునిశితంగా గమనిస్తోంది.

కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదముందని అమెరికా సహా వివిధ దేశాలు హెచ్చరించాయి. ఆ ప్రాంతంలో ఎవరూ ఉండొద్దని తమతమ దేశాల పౌరులకు సూచించాయి. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్ దాడులకు తెగబడే అవకాశం ఉందని, ఎవరూ విమానాశ్రయం చుట్టుపక్కలకు రావొద్దని తమ ప్రజలకు పలు దేశాలు సూచించాయి. యాబీ గేట్, తూర్పు గేట్, ఉత్తర గేట్ వద్ద ఉన్న అమెరికా ప్రజలంతా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. ఉగ్రవాద దాడి ముప్పు అత్యంత ఎక్కువగా ఉందని ఆస్ట్రేలియా విదేశాంగ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఆస్ట్రేలియన్లు ఎవరూ రావొద్దని సూచించింది. ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే వెంటనే అక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని, తదుపరి సూచనలు వచ్చే వరకు వేచి చూడాలని తెలిపింది.