ప్రముఖ నటి సులోచన కన్నుమూత.. ప్రధాని దిగ్భ్రాంతి..!

0
231

మరాఠీ, హిందీ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన సులోచన లట్కర్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ముంబై దాదర్ లో సుశ్రూష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సులోచన లాట్కర్ వయసు 94 సంవత్సరాలు. కెరీర్ ఆరంభంలో హిందీ, మరాఠి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసింది. ఎక్కువగా అమ్మపాత్రల్లో కనిపించారు. సులోచన లాట్కర్ మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా ఆమె మృతిపట్ల సంతాపం ప్రకటించారు. సులోచనా మరణం భారతీయ చలనచిత్ర ప్రపంచంలో పెను శూన్యానికి కారణమైందని.. ఆమె మరపురాని పాత్రలను ప్రతి ఒక్కరూ అభిమానించారని మోదీ ట్విట్ చేశారు. ఎన్నో తరాల వాళ్లు ఆమె పాత్రలను ప్రేమిస్తూనే ఉన్నారని మోదీ తెలిపారు.

1928 జూలై 30న బెల్గాం జిల్లా ఖడక్లత్ గ్రామంలో నాగబాయిగా జన్మించిన సులోచన లట్కర్ మాధురి సినిమాతో 1932లో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సినిమాలో నటించినప్పుడు ఆమె వయసు కేవలం 4 సంవత్సరాలు. సులోచన లట్కర్ దాదాపు 250 హిందీ సినిమాల్లో నటించారు. 50కి పైగా మరాఠీ చిత్రాలలో నటించారు. ప్రముఖ నటులు సునీల్ దత్, దేవ్ ఆనంద్, రాజేష్ ఖన్నాలకు సులోచన లట్కర్ తల్లి పాత్రను పోషించారు. 1980ల కాలంలో దాదాపు స్టార్ హీరోలు, హీరోయిన్స్ అందరికి అమ్మపాత్రలో నటించారు. 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో 250కు పైగా హిందీ, మరాఠి సినిమాల్లో నటించింది. 1999లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. చివరిగా 2007లో ఓ హిందీ సినిమాలో నటించారు.

సులోచన లట్కర్ పద్నాలుగేళ్ల వయసులో జమీందార్ కుటుంబానికి చెందిన అబాసాహెబ్ చవాన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సులోచన పెద్దగా సినిమాల్లో నటించలేదు. సులోచనకు కంచన్ అనే కూతురు ఉంది. కంచన్ ప్రముఖ మరాఠీ నటుడు కాశీనాథ్ ఘనేకర్‌ను వివాహం చేసుకున్నారు.