వరదల్లో కొట్టుకుపోయిన రిపోర్టర్ జమీర్ మృతి

0
977

మూడు రోజుల కిందట వరదల్లో కొట్టుకుపోయిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతి చెందారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామోజీ పేట వాగు వద్ద వరదల్లో చిక్కుకున్న కూలీల వార్తలను కవర్ చేయడానికి వెళ్లి కారుతో సహా కొట్టుకుపోయిన జర్నలిస్టు జమీర్ మృతి చెందారని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం జమీర్ మృతదేహాన్ని, కారును వెలికి తీశారు.

48 గంటలకు పైగా సాగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత, శుక్రవారం రిపోర్టర్ జమీరుద్దీన్ మృతదేహాన్ని గుర్తించారు. చెట్టుకు ఇరుక్కుపోయిన మృతదేహాన్ని గుర్తించారు. గురువారం కారు జాడను గుర్తించినప్పటికీ, వరద కారణంగా సహాయక సిబ్బంది దానిని బయటకు తీయలేకపోయారు. జులై 12వ తేదీ రాత్రి జమీరుద్దీన్ తన స్నేహితుడితో కలిసి గోదావరి వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మంది కూలీలను బోర్నపల్లి వద్ద ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించిన విషయాన్ని రిపోర్ట్ చేసి జగిత్యాలకు తిరిగి వస్తుండగా కారు కొట్టుకుపోయింది. రాయికల్ మండలం రామోజీపేట, భూపతిపూర్ గ్రామాల మధ్య నీటి ప్రవాహంలో వీరిద్దరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయిందని పోలీసులు తెలిపారు. వరద నీరు ప్రవహిస్తున్న వంతెనను దాటేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. చెట్టును పట్టుకుని లతీఫ్ తప్పించుకోగా, జమీరుద్దీన్ అదృశ్యమయ్యాడు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ వర్షం కారణంగా వాటికి అంతరాయం ఏర్పడింది. జమీర్ మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ చ్చారు.