మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్‌గఢ్ జిల్లా శ్రీవర్ధన్‌లో అనుమానాస్పద బోటు కనిపించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్లతో పాటు కాట్రిజ్డ్‌లు లభ్యమయ్యాయి. హరిహరేశ్వర్‌లో ఓ చిన్న బోటు కనిపించగా, అందులో లైఫ్ జాకెట్, కొన్ని అనుమానాస్పద వస్తువులు దొరికాయి. శ్రీవర్ధన్‌లోని హరిహరేశ్వర్, భరద్‌ఖోల్ వద్ద పడవలు గుర్తించారు. హరిహరేశ్వర్ వద్ద పడవలో రెండు-మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు లభ్యమయ్యాయి. రెండు పడవల దగ్గర ఎవరూ కనిపించలేదు. అధికారులు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ హెడ్‌కు సమాచారం అందించారు.. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో గురువారం హరిహరేశ్వర్ బీచ్ సమీపంలో అనుమానాస్పద పడవలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, AK-47 రైఫిల్స్ కనిపించడంతో భద్రతను పెంచినట్లు వార్తా సంస్థ ANI కి అధికారులు తెలిపారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బృందాన్ని రాయగడకు తరలించారు. పడవలో మూడు ఏకే-47 రైఫిళ్లు, కొన్ని బుల్లెట్లు లభ్యమయ్యాయని, పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారని అధికారి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. అధికారుల ప్రకారం.. ఈ పడవలోని సిబ్బందిని ఈ ఏడాది జూన్‌లో ఒమన్ తీరానికి సమీపంలో రక్షించారు. హరిహరేశ్వర్ బీచ్‌లో గుర్తుతెలియని పడవ, రాయ్‌గఢ్ జిల్లాలోని భరద్ఖోల్లో లైఫ్‌బోట్ లభ్యమయ్యాయి. రెండింటిలోనూ ఎవరూ లేరు. ఇదే విషయాన్ని కోస్ట్‌గార్డ్‌కు, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డుకు సమాచారం అందించారు. పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటోందని స్థానిక పోలీసులు తెలిపారు. రాయగడలోని శ్రీవర్ధన్‌కు చెందిన హరిహరేశ్వర్ & భరద్ఖోల్లో ఆయుధాలు & పత్రాలతో కూడిన కొన్ని పడవలు దొరికాయని శ్రీవర్ధన్ (రాయ్‌గఢ్) ఎమ్మెల్యే అదితి తట్కరే విలేకరులతో అన్నారు.
“ప్రాథమిక సమాచారం ప్రకారం, రాయ్‌ఘడ్‌లోని శ్రీవర్ధన్‌లోని హరిహరేశ్వర్, భరద్ఖోల్లో ఆయుధాలు, పత్రాలతో కూడిన కొన్ని పడవలు కనుగొనబడ్డాయి. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, నేను అత్యవసరంగా ATS, స్టేట్ ఏజెన్సీ ప్రత్యేక బృందాన్ని నియమించాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్‌ను డిమాండ్ చేస్తున్నాను. ” అదితి తట్కరే అన్నారు. రాయ్‌ఘడ్ పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ దూదే, ఇతర సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పడవలో సోదాలు చేశారు. ముంబైకి 190 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న శ్రీవర్ధన్ ప్రాంతంలో సిబ్బంది లేని బోటును కొందరు స్థానికులు గుర్తించి భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు.
డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ విలేకరులతో మాట్లాడుతూ.. బోటు ఆస్ట్రేలియా పౌరుడికి చెందినదని తెలిపారు. “సముద్రంలో బోట్ ఇంజన్ పగిలింది, కొరియన్ బోట్ ద్వారా అందులోని వారిని రక్షించారు. అది ఇప్పుడు హరిహరేశ్వర్ బీచ్‌కు చేరుకుంది.” అని ఆయన చెప్పారు. అవసరమైతే అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపుతామని, నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, జాగ్రత్తలు పాటించామని ఫడ్నవీస్ తెలిపారు. ఉగ్రవాద కోణం లేదని ఆయన చెప్పారు.