గోదావరి పరీవాహ ప్రాంతాలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటించారు. గురు, శుక్రవారాల్లో చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని అయోధ్య లంకకు చంద్రబాబు చేరుకున్నారు. గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గినా, గ్రామాల్లోని వరద నీరు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. బోట్లలో చంద్రబాబు నాయుడు.. లైఫ్ జాకెట్ తొడుక్కుని వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరారు.
ఈ పర్యటనలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, ఉండి ఎమ్మెల్యే రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు పార్టీకి చెందిన మరో నేత సత్యనారాయణ గోదావరి నదిలో పడిపోయారు. తక్షణమే స్పందించిన మత్స్యకారులు టీడీపీ నేతలను నదిలో నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా సోంపల్లి చేరుకున్న సందర్భంగా టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న రెండు పడవలు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఓ వైపునకు ఒరిగిపోయిన పడవలో ఉన్న టీడీపీ నేతలు గోదావరిలో పడిపోయారు. మత్స్యకారులు వేగంగా స్పందించడంతో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.