ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచం మొత్తం ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల అధ్యక్షులను కలిపేందుకు సర్వ శక్తుల ఒడ్డుతోంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తలొగ్గకపోవడం, రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గకపోవడంతో వార్ 70 రోజుల నుంచి కొనసాగుతోంది.
అయితే ఇదే సమయంలో పుతిన్ పై ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వాంగా గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే ‘ఆమె వాక్కు బ్రహ్మంగారి వాక్కు’.. ప్రపంచ పరిణామాల గురించి ఆమె ముందే ఊహించి చెప్పిన వాటిలో దాదాపు 85 శాతం నిజమయ్యాయి. అమెరికాపై రెండు లోహ విహంగాల దాడులు జరుగుతాయని, అందులో అమాయక ప్రజలు మృత్యువాత పడతారని (9/11 దాడులు)… 2004లో భారీ సునామీ వచ్చి అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పిన విషయాలు నిజమయ్యాయి. సిరియా నుంచి ముస్లిం యుద్ధం ప్రారంభమవుతుందని ఆమె చెప్పినట్టే 2014 నుంచి ఐఎస్ ఉగ్రవాదం పురుడుపోసుకుంది. తాజాగా, ఉక్రెయిన్, రష్యా దండయాత్ర గురించి 43 ఏళ్ల కిందటే అంధ జ్యోతిషురాలు చెప్పడం గమనార్హం.
ఆమె అంచనా వేసినట్టుగానే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగింది. ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రాడామస్ కన్నా కచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేశారు బల్గేరియాకు చెందిన బాబా వాంగా. ఆమె 26 ఏళ్ల కిందటే 1996లో తన 84 వ ఏట కన్నుమూశారు. ఇప్పుడు చెబుతున్నవన్నీ ఆమె అంతకు ముందే అంచనావేసినవి.. తన చిన్నతనంలో వచ్చిన ఓ భయంకర పెను తుఫానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వంగా దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ఆమె అనుచరులు చెబుతారు.
బాల్కన్‌ల నోస్ట్రాడామస్‌గా పేరుగాంచిన బాబా వాంగా.. 1979లో ప్రముఖ రచయిత వాలెంటినా సిడోరోవ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా ప్రపంచాన్ని శాసించబోతోందని వెల్లడించారు. అంతేకాదు రష్యాను ఎవరూ అడ్డుకోలేరని, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీర్తి కొండలా పెరుగుతుందని అంచానా వేశారు. ‘అన్నీ మంచులాగా కరిగిపోతాయి.. ఒక్కదాన్ని మాత్రమే తాకలేరు అదే వ్లాదిమిర్ కీర్తి.. రష్యా కీర్తి’ అని అన్నారు. ‘‘ఆయన దారికి ఎదురే ఉండదు.. ప్రపంచానికి ప్రభువుగా కూడా మారతారు’’ అని జోస్యం చెప్పారు.
బాబా వాంగా 50 ఏళ్ల జ్యోతిషం కెరీర్‌లో చెప్పిన 85 శాతం అంచనాలు నిజమయ్యాయి. కరోనా వైరస్, 1986 చెర్నోబిల్ అణు ప్రమాదం, 1997లో ప్రిన్స్ డయానా మరణం విషయంలో ముందే ఊహించి చెప్పారు. ఓ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం కల్లోలమవుతుందని జోస్యం చెప్పారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తోంది. అలాగే, 2000లో కుర్సుకు సబ్-మెరైన్ సముద్రంలో మునిగి పోతుందని చెప్పారు.
అయితే, అమెరికా 45వ అధ్యక్షుడు దేశాన్ని పతనానికి గురిచేసే సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె వేసిన అంచనా మాత్రం తప్పింది. బారక్ ఒబమా తర్వాత అమెరికా అంతమపోతుందని ఊహించారు. అయితే ట్రంప్ హయాంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అమెరికా ఇప్పటికీ శక్తివంతంగానే ఉంది. గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చి దాడులు చేస్తారని, నగరాలపై బాంబులు వేసి ప్రజలను బందీలుగా తీసుకుంటారని చెప్పిన జోస్యం కూడా ఫలించలేదు.
2010లో ప్రపంచ యుద్ధం మొదలై 2014లో ముగుస్తుందని చెప్పారు. అయితే, ఆమె చెప్పినట్టు ఎలాంటి యుద్ధం రాలేదు. ఈ యుద్ధం సంప్రదాయ ఆయుధాలతో ప్రారంభమై అణ్వాయుధాలు ప్రయోగించుకునే వరకు వెళ్తుందని అన్నారు. ఆమె అంచనా వేసినట్టు అసలు 2010లో ఎటువంటి యుద్ధ సూచనలే రాలేదు.
అయితే మిడతల దాడి భారతదేశంలో పంటలపై దాడి చేసి కరువును కలిగిస్తుంది. భూ ప్రపంచంపై డ్రాగన్ చైనా ఆధిపత్యం సాధిస్తుంది. మానవత్వం మరచి ప్రవర్తించే ఈ డ్రాగన్‌కు వ్యతిరేకంగా మూడు పెద్ద శక్తులు ఏకం అవుతాయి. వాతావరణ మార్పుల కారణంగా మానవజాతి తీవ్ర కరువు బారిన పడుతుంది. ప్రజలు బీటిల్స్, ఆకులు, మట్టిని తిని చనిపోతారు. మంచుకొండల్లోని హిమనీనదాల్లో ప్రాణాంతక వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొంటారు. ఇది వేగంగా వ్యాపించి భారీగా మానవుల, జంతువుల మరణాలకు కారణమవుతుంది. అని బాబా వాంగ అంచనా వేశారు.
బల్గేరియాలోని పెట్రిచ్‌లో 1911, జనవరి 31న బాబా వాంగ జన్మించారు. ఈమె 1996 ఆగస్టు 11న మరణించారు. తన 12వ ఏట ఓ టోర్నడోలో కొట్టుకుపోయినా, ప్రాణాలతో వాంగ బయటపడ్డారు. బాబా వాంగ కళ్లలో ఇసుక పడటంతో చూపు కోల్పోయారు. ఈమె తన 16వ ఏట నుంచే భవిష్యవాణి మొదలుపెట్టారు. తండ్రి గొర్రెల మందను దొంగలు ఎత్తుకెళతారనేది ఆమె మొదటి జోస్యం. 30 ఏళ్ల వయసుకే ఆమె అతీంద్రియ శక్తులు పెరిగి, ‘నోస్ట్రడామస్ ఆఫ్ ద బాల్కన్స్’గా జనం పిలిచుకునే స్థాయికి చేరింది.
అసలే సెంటిమెంట్లను బలంగా నమ్మిన జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఓసారి బాబా వాంగాను పిలిపించుకొని భవిష్యవాణి చెప్పించుకున్నారని, ఆ విషయం ముందుగానే పసిగట్టి ఆమె దొరక్కుండా దాక్కున్నారని ప్రచారంలో ఉంది. 1996లో చనిపోవడానికి ముందే రాబోయే వందేళ్లకు సంబంధించిన జ్యోతిషాన్ని చెప్పారామె. సిరియాలో ‘గ్రేట్ ఇస్లామిక్ వార్’ మొదలై 2043 నాటికి రోమ్‌పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందనీ ఆమె చెప్పారు.