Sai Lens

మోదీ విఫలం..! మరి గెలిచిందెవరు..?

నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తోంది అని అంటారు పెద్దలు. దేశంలో covid సెకండ్ వేవ్ నేపథ్యంలో మన లూటియెన్స్ జర్నలిస్టులు చేస్తున్న ప్రచారం ఈ వాక్యానికి సరిగ్గా సరిపోతుంది. అయితే నిజం నిలకడ మీద తెలుస్తోంది. ఈ విష ప్రచారామ్ వెనక కుట్రల్ని విశ్లేషించుకుంటే సత్యానిదే విజయమని నిరూపితమవుతుంది.

రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ విక్రమ్ సూద్ చాణక్య ఫోరమ్ గ్లోబల్ మ్యాగజైన్ లో ఒక వ్యాసం రాశారు. XI IS FINE, BLAME IT ON MODI అనే శీర్షికతో అయన రాసిన వ్యాసంలో.. ప్రస్తుత పరిణామాలను స్పష్టంగా వివరించారు. లక్షలాది మందిని బలిగొన్న ఈ వైరస్ ని చైనా ఉద్దేశపూర్వకంగా తయారు చేసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆ దేశ మాజీ స్టేట్ సెక్రటరీ మైక్ పాంపియో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో స్పష్టం చేసారు. చైనా వుహాన్ వైరాలజి ల్యాబ్ లోనే ఈ వైరస్ రూపొందించారని అటు అమెరికన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీస్, బ్రిటిష్ నిఘా వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. అయితే వైరస్ తో ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన చైనాని… ఆ దేశాధ్యక్షుడైన జి జింపింగ్ ని ఒక్క మాట కూడా అనకుండా.. ఈ మొత్తం విపత్తుకి భారత్ ను మాత్రమే బాధ్యుల్ని చేసే కుట్ర జరుగుతోందని విక్రమ్ సూద్ వ్యాఖ్యానించారు. దీనికి మన దేశంలోని లూటియెన్స్ జర్నలిస్టులే సహకరిస్తున్నారని అయన వాపోయారు. స్మశానాల్లో డ్రోన్ కెమెరాలు.. అంత్య క్రియలకు సంబంధించిన ఫొటోల్ని అమ్ముకోవడం.. అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు… ఛానళ్లలో కథనాలు .. ఇలా స్మశాన పాత్రికేయుల పైశాచికానందాన్ని దేశంపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు విక్రమ్ సూద్.

మరోవైపు మే 28వ తేదీన TIME మ్యాగజైన్ కి దేబాశీష్ రాయ్ చౌదరి ఒక వ్యాసం రాసారు. అదేంటంటే Modi Never Bought Enough COVID-19 Vaccines for India, Now the Whole World Is Paying … అంటే మోడీ అవసరానికి సరిపడా వాక్సిన్లు కొనుగోలు చేయక పోవడం వల్ల ఇప్పుడు ప్రపంచం మూల్యం చెల్లించుకుంటోంది అని. ప్రపంచ దేశాలపై బయో వార్ కి పూనుకున్న చైనా అధ్యక్షుడిని పల్లెత్తు మాటా అనకుండా.. మోడీ అవసరానికి సరిపడా వాక్సిన్లు కొనుగోలు చేయక పోవడం వల్లే ప్రపంచం ఇబ్బంది పడుతోంది అని వ్యాసాలు రాయడాన్ని ఎలా చూడాలి..? ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన TIME మ్యాగజైన్ లో ఈ వ్యాసాన్ని ప్రచురించడం దేనికి సంకేతం..? చైనా చేసిన నీతి మాలిన పనిని కప్పి పుచ్చేందుకు భారత్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది..? అసలు అంతర్జాతీయ పత్రికల క్రెడిబిలిటీ ఇంతలా దిగజారిపోవడం ఈ మధ్యే చుస్తున్నామా… లేక దశాబ్దాలుగా జరుగుతున్నదేనా..? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పాశ్చాత్య దేశాల దురహంకారం గురించి… బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ లాంటి మీడియా సంస్థల రేసిస్ట్ భావజాలం గురించి అర్థం చేసుకోవాలంటే… ఒకసారి మనం గతంలోకి వెళ్ళాలి. బ్రిటిషర్ల గుత్తాధిపత్యాన్ని సవాల్ చేసిన ఓ మహానుభావుడి గురించి తెలుసుకోవాలి. ప్రాచీన కాలంలో నావికా శాస్త్రంలో అపార అనుభవమూ, ప్రావీణ్యము కలిగి ఉన్న భారతీయులు ఫ్రెంచ్, డచ్ ప్రాంతాలతో వాణిజ్య నిమిత్తం పెద్ద పెద్ద నావల మీద పర్యటించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే విదేశీయుల దురాక్రమణల తర్వాత మన వాణిజ్యం మందగిస్తూ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశానంతరం షిప్పింగ్ వ్యవస్థ మొత్తం వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంది. కాల క్రమంలో భారతీయులు షిప్పింగ్ వ్యవస్థకే దూరమవుతూ వచ్చారు. తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్యోద్యమ నాయకుడు చిదంబరం పిళ్ళై దీన్ని గుర్తించారు. బ్రిటీషర్లకు ధీటుగా 1906 లో ఒక షిప్పింగ్ కంపెనీ ప్రారంభించారు. British India Steam Navigation Company కి పోటీగా చిదంబరం పిళ్ళై …అనేక వ్యయ ప్రయాసలకోర్చి స్వదేశీ షిప్పింగ్ కంపెనీ ని స్థాపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మందిని తమ కంపెనీలో భాగస్వాముల్ని చేస్తూ మొత్తం పది లక్షల రూపాయలు జమ చేసి… మొట్టమొదటి భారతీయ షిప్పింగ్ కంపెనీని స్థాపించారు.

స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటీషర్ల గుప్పిట్లో ఉన్న షిప్పింగ్ రంగం లోకి ఒక్కసారిగా ఒక భారతీయుడు ప్రవేశించడంతో తెల్ల దొరలు ఆయన్ని అనేక ఇబ్బందులకు గురి చేసి ఆ కంపెనీపై అనేక ఆంక్షలు విధించి.. దాన్ని ఎదగకుండా అడ్డుకున్నారు. చివరికి స్వదేశీ కంపెనీని మూసివేసేలా ఒత్తిడి చేసారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే… కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఇంచు మించు ఆనాటి పరిస్థితులనే ప్రతిబింబిస్తున్నాయి. అయితే అప్పుడు విదేశీ పాలకులు మన ఎదుగుదలను అడ్డుకుంటే… ఈనాడు విదేశీ కంపెనీలకు అమ్ముడుపోయిన స్వదేశీయులే మన పురోగతిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గతేడాది కరోనా విలయానికి ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే నిబ్బరంగా నిలబడిన భారత దేశాన్ని చూసి అభివృద్ధి చెందిన దేశాలు సైతం నివ్వెరపోయాయి. పాశ్చాత్య దేశాలకు దీటుగా కరోనా నియంత్రణకు కావలసిన PPE కిట్లు, శానిటైజర్లు, మాస్కులను భారత్లోనే తయారు చేసుకోగలిగాము. ప్రపంచ ఫార్మా లాబీ ఆశ్చర్య పోయేలా పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో కోవిడ్ వాక్సిన్ ని ఆవిష్కరించుకోగలిగాము. విదేశీ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేసే ఈ చర్యలని ఆయా దేశాలు సహిస్తాయా..?

ఆనాడు చిదంబరం పిళ్ళై స్థాపించిన స్వదేశీ షిప్పింగ్ కంపెనీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో.. ఈనాటి స్వదేశీ ఉత్పాదక రంగానికి అలాంటి సమస్యలే ఎదురవుతున్నాయి. అప్పటి కాంగ్రెస్ నాయకుడైన చిదంబరం పిళ్ళై స్వదేశీ కంపెనీ కోసం తపిస్తే… అదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు స్వదేశీ వ్యాక్సిన్లపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. అప్పటి నాయకులు విదేశీ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తే.. నేటి కుహనావాదులు అదే విదేశీ సంస్థలకు దేశాన్ని తాకట్టు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. నాటి స్వదేశీ షిప్పింగ్ కంపెనీని బ్రిటిషర్లు మూసేందుకు కుట్రలు పన్నితే… అదే బ్రిటిష్ భావజాలాన్ని వంటబట్టించుకున్న నేటి సూడో సెక్యూలర్లు స్వదేశీ ఉత్పత్తులపై విష ప్రచారం చేస్తున్నారు… అన్ని రంగాల్లో దేశం విఫలమయ్యేలా అనేక కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం భారత్. జనాభా గురించి ప్రస్తావించడం వెనక ఒక ప్రత్యేక కారణం ఉంది. 139 కోట్ల జనాభాయే మన బలం, బలహీనత. ఇన్ని కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందించడం… మౌలిక వసతులు కల్పించడం… ఆరోగ్య, ఆహార, ఉద్యోగ భద్రత కల్పించడం సాధారణ విషయం కాదు. భిన్న వర్గాలుగా… ప్రాంతాలుగా ఉన్న ఈ దేశాన్ని నడిపించడం అనేక సవాళ్లతో కూడుకున్న అంశం… అందుకే మన జనాభాయే ఒక రకంగా మన దేశపు బలహీనత. అదే సమయంలో… మన జనాభానే మన బలం. ఎలాగంటే… ప్రపంచ దేశాల ఉత్పత్తులకు… భారత్ లోని కోట్లాది వినియోగదారులే ఆదాయ వనరు. సబ్బులు, టూత్ పేస్ట్ ల దగ్గరి నుంచి… సోషల్ మీడియా మాధ్యమాల దాకా మన దేశంలోని ప్రజలు ఆదరిస్తే చాలు ఆయా కంపెనీలు కోట్లు గడిస్తాయి. కేవలం ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టి అనేక కంపెనీలు కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయి. ఇది దశాబ్దాలుగా జరుగుతూ వస్తోంది. స్వదేశీ పరిజ్ఞానానికి కొదవ లేకున్నా… ఇక్కడి ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించడంలో.. వాటికి మార్కెట్ కల్పించడంలో… 70 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు విఫలమవుతూనే వస్తున్నాయి. విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరచి… స్వదేశీ టాలెంట్ ని మరుగున పరచే చర్యలు అనేకం చోటు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో మన దేశం లో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో మేధో పరమైన సేవలందిస్తూ విజయం సాధించిన వారు చాల మంది. 70 ఏళ్ల తర్వాత మన దేశంలో ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి జాతీయవాద ప్రభుత్వం ఉపక్రమించింది. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా అంటూ.. భారత ప్రభుత్వం స్వదేశీ కంపెనీలకు పెద్ద పీట వేస్తోంది. ఒకవైపు కరోనా విలయ సమయంలో కూడా ఆత్మ నిర్భర భారత్ నినాదంతో దేశీయ కంపెనీలు భారత్ ఉత్పాదక రంగాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నాయి. ఇదే అంతర్జాతీయ వ్యాపార మాఫియాకి అసలు సమస్యగా మారింది. ముఖ్యంగా చైనాకి ఇది మింగుడు పడని అంశం.

గతంలో విదేశీ కంపెనీల దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఆయా రంగాల్లో భారీ స్థాయిలో పురోగతి సాధించి… ఎగుమతుల వైపు అడుగులు వేస్తోంది. మౌలిక వసతుల కల్పనలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో విదేశీ సంస్థలు భారతీయ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో గతంలో డాలర్లలో చెల్లించి విదేశీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ వచ్చిన మన దేశం… విదేశీ పెట్టుబడులతో స్వదేశీ కంపెనీలను బలోపేతం చేసుకుంటూ ఉత్పత్తిని భారీగా పెంచగలుగుతోంది. దీంతో 2015 వరకు అత్యధికంగా మొబైల్ దిగుమతులు చేసుకున్న భారత్ ఇప్పుడు ప్రపంచానికే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదిగింది. 2014 లో కేవలం రెండు మాత్రమే ఉన్న మొబైల్ ఉత్పత్తి కేంద్రాలు 2019 కి 263 కు చేరుకున్నాయి. దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి దేశీయ మొబైల్ ఉత్పత్తి పరిశ్రమ చేరుకుంది.

ఇప్పుడు చైనాకు దీటుగా రిలయన్స్ జియో ఆధ్వర్యంలో 5జి టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. అటు ఫార్మా రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 18.7 శాతం వృద్ధి రేటుని సాధించింది. సుమారు 200 దేశాలకు నాణ్యతతో కూడిన మందులను సరఫరా చేస్తున్న భారత్ 2030 నాటికి 130 బిలియన్ డాలర్ల పరిశ్రమగా అవతరిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో రైతులు యూరియా కోసం ఎదురుచూసే వారు… లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్న రోజులు కూడా గుర్తుండే ఉంటాయి. అలాంటిది గడచిన 5 సంవత్సరాల్లో ఫెర్టిలైసర్స్ ఇండస్ట్రీ ఊహించని పురోగతి సాధించింది. గతంలో యూరియా కొరత ఉన్న పరిస్థితుల నుంచి నేడు 42 నుంచి 45 మిలియన్ టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుంది. దేశీయ అవసరాల నిమిత్తం 18 మిలియన్ టన్నుల యూరియా దిగుమతి చేసుకుంటున్నాము. అయితే పెరుగుతున్న ఉత్పత్తి దృష్ట్యా.. 2023 సంవత్సరం చివరికల్లా భారత్ యూరియా విషయంలో ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధిస్తుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రకటించారు. అటు డిఫెన్స్ సెక్టార్ లో కూడా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఈ మధ్యనే 101 పరికరాల దిగుమతుల్ని నిలిపివేస్తూ.. వాటిని దేశీయంగానే ఉత్పత్తి చేస్తున్నట్టు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. దిగుమతులను తగ్గిస్తూ… దేశీయంగానే ఉత్పత్తి జరిగే విధంగా దాదాపు అన్ని రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలు చేస్తోంది భారత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలకు… ముఖ్యంగా ఉత్పాదక రంగంలో గుత్తాధిపత్యాన్ని కలిగిన చైనాకు ఒక పెద్ద మార్కెట్ క్రమ క్రమంగా దూరమవుతున్న అంచనా ఏర్పడింది. అందుకే చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు తెరిచే కమ్యూనిస్టులు.. చైనా చైర్మనే మా చైర్మన్ అని ప్రకటించి… 1962 యుద్ధంలో చైనాకు మద్దతిచ్చిన కామ్రేడ్ల వారసులు భారత ప్రభుత్వంపై లేని పోనీ అబద్ద ప్రచారాలు చేస్తున్నారు అనేది నిర్వివాదాంశం.

బహుళజాతి కంపెనీలను అడ్డుకోవాలంటూ ధర్నాలు … పెట్టుబడిదారి వ్యవస్థ నశించాలంటూ నినాదాలు… కార్మికుల హక్కుల పేరుతొ ఉద్యమాలు చేసే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులూ … చైనా విస్తార వాదం గురించి… ఉత్పత్తి లక్ష్యాల కోసం ఎంతకైనా తెగించే ఆ దేశ ప్రభుత్వ నిరంకుశ విధానాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. వీళ్ళ టార్గెట్ కేవలం భారత వ్యాపార దిగ్గజాలైన అంబానీ, ఆదానీలు … టాటా, బిర్లాలు.. పతంజలి లాంటి సంస్థలు మాత్రమే… సబ్బుల దగ్గరి నుంచి సెంటు బాటిళ్ల దాకా రసాయనాలతో నిండిన ఉత్పత్తులతో మార్కెట్లను నింపేస్తున్న విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వీరు మాట్లాడారు…కానీ దానికి భిన్నంగా అసలు కెమికల్స్ వినియోగించకుండా విదేశీ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఉత్పత్తుల్ని అందిస్తున్న పతంజలి మీద మాత్రం అనేక ఆరోపణలు చేస్తారు. హోలీ రంగుల నుంచి.. సంక్రాతి గాలిపటపు మాంజా వరకు… చిన్న పిల్లల ఆటవస్తువుల నుంచి మొబైల్ అప్లికేషన్ల వరకు భారత దేశ వినియోగదారులపై కోట్లు గడించే చైనా కంపెనీలు వీరికి పర్వాలేదు.. కానీ పతంజలి కొరొనిల్ ని మాత్రం బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తారు.

ట్విట్టర్లు, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సైట్లు మన డేటాని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకున్నాయి అని తెలిసినా సమస్యేమీ లేదు… కానీ ఆధార్ కార్డు కోసం భారత ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలంటే మాత్రం కోర్టుల్లో కేసులు వేస్తారు. సోషల్ మీడియా సైట్లలో వ్యక్తిగత సమాచారం పెడితే వీరికి నష్టం లేదు … కానీ ఆరోగ్య సేతు యాప్ మాత్రం సేఫ్ కాదని ప్రచారం చేస్తారు. దేశంలో అలజడి సృష్టించి హింసాయుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించే అంతర్జాతీయ ఫార్మా, ఆయుధ వ్యాపారులు, మీడియా సంస్థలు కుహనా వాదుల దృష్టిలో ప్రజాస్వామ్య పరిరక్షకులు.. అదే సమయంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ దేశ జీడీపీ కి తోడ్పడే అంబానీ, ఆదానీ, టాటా బిర్లాలు దుర్మార్గులు. దేశాన్ని అస్థిర పరచాలని కుట్రలు పన్నే కలియుగ రాక్షసుడు జార్జ్ సోరోస్ వీరికి ఆదర్శ మూర్తి… కానీ భారత అభివృద్ధి కోసం అహరహమూ తపించే మోడీ ఫాసిస్ట్.

70 ఏళ్లుగా చరిత్రను వక్రీకరించి గత వైభవాన్ని చెరిపేస్తూ …భారత్ ను ఒక అనాగరిక దేశంగా…చిత్రీకరిస్తూ వచ్చిన జర్నలిస్టులు.. ఏదైనా విపత్తు సంభవిస్తే వరల్డ్ బ్యాంకు విదిల్చే నిధుల కోసం.. వెంపర్లాడిన గత ప్రభుత్వాల నాయకులూ.. ఇక్కడి పేదరికాన్ని, నిరక్షరాస్యతను ప్రచారం చేస్తూ విదేశీ సంస్థల నిధుల్ని దారి మళ్లించిన NGO ల ప్రబుద్దులు… ఇప్పుడు భారత్ ను ప్రతి విషయంలో అగ్ర రాజ్యమైన అమెరికాతో… యూరోపియన్ దేశాలతో పోల్చి వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో పాకిస్తాన్, శ్రీలంకలతో పోల్చుకున్న నాయకులూ ఇప్పుడు భారత్ ను అగ్ర రాజ్యాలతో పోల్చుతుండడమే వారి కుటిల నీతికి సాక్ష్యం… భారత్ అభివృద్ధికి నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published.

5 × 4 =

Back to top button