More

    భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. బ్లాక్ ఫంగస్ ఔషధాలను అందుబాటులోకి తెస్తున్నాం

    భారతదేశంలో గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా 2,11,298 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 2,83,135 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,69,093కు చేరింది. మరో 3,847 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,15,235కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,46,33,951 మంది కోలుకున్నారు. 24,19,907 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,26,95,874 మందికి వ్యాక్సిన్లు వేశారు.

    భారతదేశంలో బ్లాక్ ఫంగస్ కట్టడికి చర్యలు తీసుకుంటూ ఉన్నామని.. అలాగే బ్లాక్ ఫంగస్ రోగుల కోసం కావాల్సిన ఔషధాలను సిద్ధం చేస్తున్నామని కేంద్ర స‌హాయ‌ మంత్రి కిష‌న్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో పెరుగుతోన్న బ్లాక్ ఫంగ‌స్ కేసుల నేప‌థ్యంలో బాధితుల‌కు మెరుగైన‌ చికిత్స అందించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. కిషన్ రెడ్డి ఈ రోజు హైద‌రాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. బ్లాక్ ఫంగ‌స్ రోగుల‌కు అందుతోన్న చికిత్స‌పై ఆరా తీయడమే కాకుండా బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. కొవిడ్-19 సోకి కోలుకున్న మ‌ధుమేహ రోగుల్లోనే బ్లాక్‌ఫంగ‌స్ స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని ఆయన చెప్పారు. బ్లాక్ ఫంగ‌స్‌కు వాడే ఔష‌ధాల కొర‌త ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని.. ఔష‌ధాల ఉత్ప‌త్తి గురించి 11 సంస్థ‌ల‌తో చ‌ర్చించామ‌ని అన్నారు. ఇన్నాళ్లు బ్లాక్ ఫంగ‌స్ కేసులు చాలా అరుదుగా వ‌చ్చేవ‌ని, అందుకే దేశంలో దాని ఔష‌ధాల కొరత ఉంద‌ని తెలిపారు. కొన్ని రోజులుగా క‌రోనా రోగుల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెరిగిపోతున్నాయ‌ని.. అవ‌స‌ర‌మైన ఔష‌ధాల‌ను విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటామ‌ని తెలిపారు. దేశంలోనూ ఔష‌ధాల ఉత్ప‌త్తి పెరిగేలా చర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం 5,690 యాంఫోటెరిసిన్-బీ ఇంజ‌క్ష‌న్ల‌ను పంపించింద‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు.

    Trending Stories

    Related Stories