పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తో కలిసి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పని చేయనున్నారు. అమరీందర్ సింగ్ పార్టీ అయిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేయనుంది. “2022 పంజాబ్ విధానసభ ఎన్నికల కోసం మేము అధికారికంగా బీజేపీతో సీట్ల సర్దుబాటును ప్రకటించాము” అని కెప్టెన్ అమరీందర్ సింగ్ శుక్రవారం (డిసెంబర్ 17) నాడు ఒక ట్వీట్‌లో తెలిపారు.
అమరీందర్ సింగ్ శుక్రవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. ఇరు పార్టీలలో ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయమై ఇంకా ఎలాంటి నిర్ధారణ లేదు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటికే సూచించిందని షెకావత్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నెల ప్రారంభంలో, షెకావత్ చండీగఢ్‌లో అమరీందర్ సింగ్‌ను కలిశారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కొన్ని నెలల ముందు రాజీనామా చేసిన తర్వాత, అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో తన సొంత పార్టీని స్థాపించారు. ముఖ్యమంత్రి పదవిని అమరీందర్ సింగ్ విడిచిపెట్టాక పలువురు భారతీయ జనతా పార్టీ నేతలతో ఢిల్లీలో భేటీ అవుతూ వచ్చారు. మార్ కైపు పంజాబ్ కాంగ్రెస్ లోని ముఖ్య నేతలతో అమరీందర్ సింగ్ విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి.