భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నదానిపై ఇంకా స్పష్టతకు రాలేదు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ తర్వాత అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అయితే బీజేపీ వర్గాల్లో ప్రధానంగా ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఒకటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు కాదా.. మరొకరు చత్తీస్ ఘడ్ గవర్నర్ అనసూయ ఊకే పేరు. ఇద్దరిలో ఒకరిని బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనకు బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆపారమైన గౌరవం ఉంది. అదే ఆయనను బీజేపీ అధ్యక్షుడి లాంటి కీలక పదవులు అందేలా చేసింది. దేశంలో అత్యంత ప్రముఖమైన నేతగా వెంకయ్యనాయుడు ఎదిగారు. ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్లారు. ఇప్పుడు దేశ అత్యున్నత పదవి వరకూ చేరుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రపతి పదవిని దక్షిణాదికి కేటాయించాలన్న ఓ డిమాండ్ కొంత కాలం నుంచి వినిపిస్తోంది. ప్రధాని లాంటి పదవి ఉత్తరాదికే దక్కుతోంది. ఈ కారణంగా దక్షిణాదికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలన్న అభిప్రాయం పెరుగుతోంది. బీజేపీ అగ్రనేతలు వెంకయ్యనాయుడుతో సమావేశం కావడం కూడా ఆయన అభ్యర్థిత్వం ఖాయం కావొచ్చన్న ప్రచారం జరగడానికి కారణం అని భావిస్తున్నారు.
మరో వైపు చత్తీస్‌ఘడ్ గవర్నర్ అనసూయ ఉయికే పేరు కూడా విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఆమె మధ్యప్రదేశ్‌కు చెందిన ఎస్టీ వర్గానికి చెందిన నేత. ఈ సారి ఎస్టీలకు రాష్ట్రపతి పదవి కేటాయించాలన్న ఆలోచనలో ఉన్నారని అందుకే ఆమె పేరు పరిగణనలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే అనసూయ ఉయికే వెంకయ్యనాయుడి మాదిరి మొదటి నుంచి బీజేపీ భావజాలం ఉన్న నేత కాదు. కాంగ్రెస్ పార్టీ తరపున మధ్యప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. అర్జున్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.
రాష్ట్రపతి అభ్యర్థిని ఏ క్షణమైనా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించబోతోంది. అయితే పార్లమెంటరీ బోర్డు ఆమోదం లాంచనప్రాయమే..అసలు నిర్ణయాలు మాత్రం మోడీ, షా చేతుల్లోనే ఉంటాయి. వారు ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టాలో ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు. వారెవరన్నది స్పష్టత లేదు. మొత్తంగా రాష్ట్రపతి రేసులో చివరికి ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి వెంకయ్యనాయుడు కాగా మరొకరు అనసూయ ఉయికే. వీరు కాకుండా ఇంకెవరి పేరునైనా అనూహ్యంగా తెరపైకి తెస్తారేమో వేచి చూడాలి.