More

    స్వీప్ చేసేసిన బీజేపీ.. నెక్స్ట్ టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలే..!

    ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే..! 75 జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్ సీట్లకు గానూ ఏకంగా 60కిపైగా స్థానాల్లో విజయం అందుకోవడంతో యూపీ బీజేపీ క్యాడర్ లో మరింత ఉత్సాహం నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందనుకున్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ బీజేపీ దరిదాపుల్లో కూడా లేకుండా పోయింది. సమాజ్‌వాదీ పార్టీ కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. మొత్తం 75 స్థానాలకు గానూ 67 స్థానాల్లో బీజేపీకి చెందిన మద్దతుదారులు గెలుపొందినట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. సీఎం యోగి, ప్రధాని మోదీ పాప్యులారిటీతోపాటు ప్రజా సంక్షేమ విధానాలే పార్టీకి విజయాన్ని కట్టబెట్టాయని స్వతంత్రదేవ్ సింగ్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 3 వేల మంది జిల్లా పంచాయతీ సభ్యులు 75 మంది ఛైర్ పర్సన్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోలింగ్‌కు ముందే 21 చోట్ల బీజేపీ మద్దతుదారులు, ఎస్పీకి చెందిన ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాలకు శనివారం ఉదయం ఓటింగ్ నిర్వహించారు. ఇందులో భారతీయ జనతా పార్టీ దాదాపుగా స్వీప్ చేసింది. బీజేపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు సూత్రధారి అయిన BKU నాయకుడు రాకేశ్ తికాయత్ యొక్క స్వస్థలమైన ముజఫర్ నగర్ సీటును భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం విశేషం.

    ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. సీఎం యోగి, యూపీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజాసేవ, న్యాయమైన పాలనను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు.

    ఈ విజయానికి కార్యకర్తలే ముఖ్య కారణమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయని.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంల వల్లే ఓడిపోయామని విపక్షాలు విమర్శలు చేశాయని, ఇప్పుడు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిగాయని అన్నారు. అయినా విపక్షాలు ఓడిపోయాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని గ్యారెంటీగా చెబుతున్నానని యోగి చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలు అఖిలేష్‌ యాదవ్‌కు గట్టి ఎదురు దెబ్బ అని.. సమాజ్‌వాదీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు.

    2016లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా 63 సీట్లు సాధించి సమాజ్‌వాదీ పార్టీ రికార్డు సాధించగా. బీజేపీ ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 67 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీలో కూడా బీజేపీ జెండా ఎగరేయడం విశేషం. స్థానిక ఎన్నికల్లో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రయాగ్ రాజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు చేశారు. వారి ఆరోపణలను బీజేపీ కొట్టి పారేసింది.

    Related Stories