Telugu States

తెలంగాణలో బీజేపీ కీలక ఎత్తుగడ..!

యుద్ధం అంటూ మొదలు పెట్టాక ప్రత్యర్ధికి ఊపిరిసలిపే సమయం కూడా ఇవ్వరాదన్నది రణ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా వర్తించే మాట. ఈ మాటే బాటగా తెలంగాణ భాజపా అడుగులు వేస్తుందా అంటే తాజా విశ్లేషణలు అవుననే అంటున్నాయి.

తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా గెలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.

నిజానికి తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ గత ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలం చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చాయి. 2018 డిసెంబర్‌లో అక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జానారెడ్డిని పోటీకి దించుతామని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక్కడ ఇంకా టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కాలేదు. కానీ, బీజేపీ కూడా చాలా మంది నేతల పేర్లను పరిశీలిస్తోంది. జానారెడ్డి కుమారుడు కె.రఘువీర్ రెడ్డి పేరును కూడా పరిశీలించింది. కానీ, జానారెడ్డి పార్టీ మారేందుకు సుముఖంగా లేకపోవడంతో ఆ పేరు పక్కన పడిపోయింది. విజయశాంతిని బరిలో దింపుతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కొన్ని కారణాల వలన ఈ నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. తాజాగా, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాషాయ కండువా కప్పుకొని ఆయన్ను పోటీకి దించాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ మీద తీవ్రంగా మండిపడుతున్నారు. బహిరంగంగానే పార్టీ మారతానంటూ కూడా ఓ దశలో ప్రకటించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, ఆయన కాంగ్రెస్ పెద్దల మీద అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఆయన ఇటీవల తిరుపతి వెళ్లిన సమయంలో తాను పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. సరైన సమయంలో పార్టీలో చేరడానికే ఆయన్ను అప్పుడు ఆపారని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే. ఆయన్ను తీసుకొచ్చి నాగార్జున సాగర్‌లో పోటీ చేయిస్తే, ఒకవేళ ఆయన గెలిస్తే అప్పుడు ఏదో ఒక చోట ఎమ్మెల్యేగా ఉండాలి కాబట్టి, ఆయన మునుగోడుకు రాజీనామా చేస్తారని, అప్పుడు తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందని, ఆ రకంగా తెలంగాణలో ఎన్నికల వేడి తగ్గకుండా చూసుకోవచ్చనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. చూడాలి ఈ వ్యూహం ఎంతవరకు అంచనాలను చేరుతుందో అన్నది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

two × two =

Back to top button