More

    అసోంలో చొరబాటుదారుల అంతుచూస్తాం : నడ్డా

    అసోం నాగరికత పరిరక్షణకు భరోసా ఇస్తూనే.. చొరబాటుదారుల అంతు చూస్తామని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. NRCని సరిదిద్ది అసోం ప్రజలకు రక్షణగా నిలుస్తామని చెప్పారు. అసోం రాజకీయ హక్కుల పరిరక్షణ కోసం డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం శర్బానంద సోనోవాల్‌ నాయకుల నేతృత్వంలో అసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘సంకల్ప్‌ పాత్ర’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, అసోం ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్, రాష్ట్ర మంత్రి హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో పార్టీ పలు వాగ్దానాలు చేసింది. వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు ‘బ్రహ్మపుత్ర విజన్’ కింద అదనపు జలాలను నిల్వ చేసేందుకు నది చుట్టూ పెద్ద రిజర్వాయర్లు నిర్మిస్తామని కూడా బీజేపీ మేనిఫెస్టో వాగ్దానం చేసింది.

    అంతేకాదు, ఒరునోడుయ్ స్కీమ్ కింద 30 లక్షల మంది అర్హత కలిగిన కుటుంబాలకు నెలకు 3 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. మిషన్‌ శిశు ఉన్నయన్‌ పథకం కింద బాలలకు నాణ్యమైన విద్య. ఎనిమిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. భారతీయ పౌరులందరికీ భూ హక్కులు కల్పించడంతో పాటు విద్య, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్యం, మహిళా సాధికారతకు పలు కార్యక్రమాలు చేపడతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

    126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడుతలుగా పోలింగ్ జరుగనుంది. ఈనెల 27న తొలి దశ పోలింగ్ జరుగనుండగా, ఏప్రిల్ 6న చివరి విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

    Trending Stories

    Related Stories