మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, రఘనందన్‌రావు, గంగిడి మనోహర్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్‌లతో కలిసి చండూరులోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మొదటి సెట్ నామినేషన్‌ను బండి సంజయ్, తరుణ్‌చుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామిలతో కలిసి రాజగోపాల్‌రెడ్డి దాఖలు చేయగా…. రెండవసెట్ను ఈటల రాజేందర్, రఘనందన్‌రావు, గంగిడి మనోహర్‌రెడ్డిలు కలిసి దాఖలు చేశారు. మూడవ సెట్‌ను కపిలవాయి దిలీప్‌కుమార్ దాఖలు చేశారు.
నామినేషన్ ర్యాలీకి ఊహించని స్పందన..
ఉదయం 10గంటలకు కుటుంబసభ్యులతో కలిసి మునుగోడులోని క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చండూరు మండలం బంగారిగడ్డ వద్ద అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఓపెన్ టాప్ వాహనంలో బయలుదేరిన రాజగోపాల్‌రెడ్డి వెంట వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా వచ్చారు. బంగారిగడ్డ నుండి చండూరు వరకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చి ఆశీర్వదించారు. ఓపెన్ టాప్ వాహనంలో రాజగోపాల్‌రెడ్డి వెంట వివేక్ వెంకటస్వామి, రఘనందన్‌రావు, ఈటల రాజేందర్, గంగిడి మనోహర్‌రెడ్డి కొంతదూరం రాగా చండూరు పట్టణ శివారులో ర్యాలీలో బండి సంజయ్, తరుణ్‌చుగ్, సునీల్‌బన్సల్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలు జాయిన్ అయ్యారు. నామినేషన్ దాఖలు సందర్భంగా వచ్చిన అశేష జనవాహినితో చండూరు కిక్కిరిసిపోయింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో చండూర్-మర్రిగూడ రహదారి కాషాయమయమైంది. భారత్ మాతాకీ జై అనే నినాదాలతో పులకించిపోయింది.