National

భారతీయ జనతా పార్టీ ప్రభంజనం తప్పదు

ABP-CVoter సర్వేలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం తప్పదని తేల్చి చెప్పింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ మరియు గోవా రాష్ట్రాలలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తన ప్రీ-పోల్ సర్వేను విడుదల చేసింది. ABP-CVoter సర్వే ప్రకారం, 2022 ప్రారంభంలో ఎన్నికలకు వెళ్లే ఐదు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ గెలవనుందని తెలిపింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్ అనే నాలుగు రాష్ట్రాలలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని పోల్ సూచిస్తోంది. కాంగ్రెస్ పాలిత పంజాబ్‌లో ABP-CVoter పోల్ ప్రకారం ఏ ఒక్క పార్టీ కూడా మెజారిటీని దాటదని చెబుతోంది. కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు చెబుతోంది.

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజల మద్దతు ఉందని.. అధికారంలో కొనసాగవచ్చని ప్రీ-పోల్ సర్వే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం తప్పదని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ABP-CVoter ఫలితాలు నిజమైతే వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని ఎదుర్కోబోతోంది.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రాబల్యం కొద్దిగా తగ్గిందని ఈ సర్వే చెబుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ కూటమి 42 శాతం ఓట్ల వాటాను పొందుతుందని భావిస్తున్నారు. 30 శాతం ఓట్ల ఓటింగ్ ఎస్పీకి దక్కుతుందని చెబుతోంది. బిఎస్‌పి కేవలం 16 శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచింది. ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 5 శాతం ఓట్లను మాత్రం చూపబోతోందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఒక 60 సీట్లు బీజేపీ కోల్పోతుందని, మొత్తమ్మీద 259 నుంచి 267 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)కి 109 నుంచి 117 సీట్లు వస్తాయని, బీఎస్పీ కేవలం 12 నుంచి 16 సీట్లు మాత్రమే గెలుస్తుందని తెలిపింది. కాంగ్రెస్ మాత్రం 3 నుంచి 7 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడని, 40 శాతం మంది ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలని కోరుకుంటున్నారు. అఖిలేష్ యాదవ్ తర్వాతి స్థానంలో 28 శాతం ప్రజలు కోరుకున్నారు. మాజీ సీఎం మాయావతి మూడో స్థానంలో నిలిచారు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో బీజేపీ ప్రాభవం తగ్గడంతో 11 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. ఇక్కడ బీజేపీ కూటమికి 46 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 21 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీ 43 శాతం ఓట్లు దక్కుతుండడంతో 44-48 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. కాంగ్రెస్ దాదాపు 33 శాతం ఓట్లను సాధించి, 19-23 స్థానాలకు పరిమితం అని అంటున్నారుఆప్‌కు 15 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నప్పటికీ ABP-CVoter సర్వే ప్రకారం, ఆప్ కేవలం 0-4 సీట్ల వరకు ఓట్ షేర్ దక్కవచ్చు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి ఎంపికలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా కొనసాగుతున్నారు. మాజీ సీఎం హరీష్ రావత్ 31 శాతం ఆధిక్యంలో ఉన్నారు, ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి 22.5 శాతంతో రెండవ స్థానంలో ఉన్నారు. బీజేపీకి చెందిన అనిల్ బలూని 19 శాతం పాపులారిటీ పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచారు. సర్వేలో దాదాపు 10 శాతం మంది ఆప్‌కు చెందిన కల్నల్ కొథియాల్ తదుపరి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.

పంజాబ్-కీలకమైన సరిహద్దు రాష్ట్రాలలో ఒకటి, ABP-CVoter సర్వే ప్రకారం, ఆశ్చర్యం కలిగించే అవకాశం ఉంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 51-57 సీట్ల వాటా మరియు 35 శాతం ఓట్ షేర్‌తో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించవచ్చని ప్రీ-పోల్ సర్వే సూచిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ హవా సాగిస్తుందని ఈ సర్వే జోస్యం చెప్పింది. ప్రస్తుతం ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈసారి 38 నుంచి 46 సీట్లకే పరిమితం అవుతుందని, ఆప్ మాత్రం 51 నుంచి 57 వరకూ సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో వ్యవసాయ చట్టాల నిరసనల నేపథ్యంలో బీజేపీ పంజాబ్ లో ఆశించిన స్థాయిలో రాణించకపోవచ్చు. పంజాబ్‌లో బీజేపీ పెద్ద శక్తి కాకపోయినప్పటికీ మొత్తం ఓట్లలో 7 శాతం పొందనుంది. బీజేపీ ఒక్క శాసనసభ సీటును కూడా గెలవలేకపోవచ్చని అంటున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 22 శాతం మంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. పంజాబ్‌లో ఆప్ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా అంచనా వేయలేదు. అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ 19 శాతంతో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ 18 శాతం దక్కించుకున్నారు.

మణిపూర్‌లో కూడా బీజేపీనే ఆధిక్యంలో నిలుస్తుందని సర్వే చెబుతోంది. ఇక్కడ బీజేపీకి 40.5 శాతం ఓట్లు పడతాయని ఊహించింది. కాంగ్రెస్ ఈసారి 34.5 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమవుతుందని చెప్పింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్‌కు 18 నుంచి 22 సీట్లు వస్తాయని తెలిపింది. మణిపూర్‌లో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను కలిగి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 18-22 సీట్లు రావచ్చు, ఎన్‌పిఎఫ్ 2-6 సీట్లు గెలుచుకోవచ్చు.

గోవా పీఠం మళ్లీ బీజేపీకే దక్కనుందని ఈ సర్వే పేర్కొంది. బీజేపీ సుమారు 39.4 శాతం ఓట్లతో అధికారం నిలబెట్టుకుంటుందని తెలిపింది. ఇక్కడ ఆప్‌కు 22.2 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 15.4 శాతం ఓట్లు మాత్రమే పడతాయని వివరించింది. సీట్ల విషయానికొస్తే బీజేపీ 22 నుంచి 26, ఆప్‌ 4 నుంచి 8, కాంగ్రెస్‌ 3 నుంచి 7 స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది. ముఖ్యమంత్రి రేసులో బీజేపీ సీఎం ప్రమోద్ సావంత్ 33 శాతం పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఆప్ అభ్యర్థిని కేవలం 14 శాతం మంది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.

ABP-CVoter సర్వే బీజేపీ ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజకీయ పార్టీ అని సూచిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

seventeen + 10 =

Back to top button