2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని ఇరికించే కుట్రకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీనే ప్రధాన సూత్రధారి అంటూ బిజెపి ఆరోపించింది.
గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ప్రధాని మోడీ రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేందుకు సోనియాగాంధీ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ని వినియోగించారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. అహ్మద్ పటేల్ ఒక పేరు మాత్రమేనని, వెనకుండి నడిపించింది సోనియా గాంధీ అని, ఆయన ద్వారా గుజరాత్ ఇమేజ్ను దిగజార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో అన్న విషయాన్ని అఫిడవిట్ బయటపెట్టిందని సంబిత్ పాత్రా విమర్శించారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ.. అల్లర్ల కేసులో అహ్మద్ పటేల్ పెద్దకుట్ర పన్నారని, దానిలో తీస్తా సెతల్వాద్ భాగమయ్యారని సిట్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. అల్లర్ల కేసులో తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడేందుకు మోడీ నడుపుతోన్న వ్యూహంలో ఇది ఒక భాగమని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం నుండి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల్లో ఈ అంశం పార్లమెంట్లో చర్చకు దారితీసే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.