కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై బీజేపీ నేతలు చెబుతోందిదే

0
868

కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మనం ఏపీలో ఉన్నామా?… పాకిస్తాన్‌లో ఉన్నామా? అని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్‌ మీద చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు అంబేద్కర్‌ పేరు పెట్టొచ్చుగా అని నిలదీశారు. కోనసీమ జిల్లాలో అల్లర్లకు బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధ్వంసకర చర్యలు సమర్థనీయం కాదని.. అల్లర్లలో బీజేపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. అంబేద్కర్‌ పేరుపై వైసీపీ ప్రభుత్వం వివాదం సృష్టించిందని, దేశప్రజలకు సీఎం జగన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.

అమలాపురం ఘటనను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఖండించారు. కొనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైందన్నారు. అమలాపురం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురం ఘటన నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని.. అమలాపురం ఆందోళనలో బీజేపీ శ్రేణులు పాల్గొనరని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ పేరును వివాదంలోకి లాగింది వైసీపీ ప్రభుత్వమేనని, కోనసీమలో లేని వివాదాన్ని సృష్టించిందన్నారు.

ప్లాన్‌ ప్రకారమే కోనసీమలో అల్లర్లు సృష్టించారని బీజేపీ నేత సత్యకుమార్‌ ఆరోపించారు. మంత్రి ఇంటినే దహనం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దాడులు చేశారని.. కోనసీమ కుట్రలో అధికార పార్టీ భాగస్వామ్యం ఉందని అన్నారు. వైసీపీ నేతల్లో కొందురు దాడులను ప్రేరేపిస్తున్నారని విశ్వరూప్‌ అన్నారని తెలిపారు.