ఆదివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..! ప్రగతి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన పద్ధతిలో అబద్ధం చెప్పిందని అన్నారు. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిందని, అప్పటినుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 105 డాలర్లకు మించలేదని తెలిపారు. ఓసారి చమురు ధరలు కుప్పకూలి 30 డాలర్లకు కూడా పడిపోయిందని, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని, రష్యాలోనూ అలాంటి పరిస్థితే వచ్చిందని.. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయంగా ధర పెరిగిందని అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు. రాష్ట్రాల వాటా ఎగ్గొట్టేందుకు ట్యాక్సులు పెంచకుండా, దాన్ని సెస్ రూపంలోకి మార్చారని అన్నారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తూ భారం మోపుతున్నారు. దానికితోడు రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎగ్గొడుతున్నారని బీజేపీపై విమర్శించారు. ఇప్పుడు పలు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో ఎక్సైజ్ సుంకం ఓ పది రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే ఓ ఘనకార్యం అన్నట్టు చెప్పుకుంటున్నారని కేసీఆర్ అన్నారు.
రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందని వెల్లడించారు. యాసంగి ధాన్యంలో తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని, యాసంగి ధాన్యం నాణ్యంగా ఉండడంలేదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) చెబుతోందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం రోజుకోమాట చెబుతోందని మండిపడ్డారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చెబుతున్నామని, వేరుశనగ, చిరుధాన్యాలతో మంచి లాభాలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అత్యంత బాధ్యతా రాహిత్యంతో మాట్లాడుతున్నాడని.. ప్రభుత్వం మెడలు వంచి పంటను కొనిపిస్తాం అంటూ రైతులకు చెబుతున్నాడని అన్నారు. చాలారోజుల నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు. కానీ క్షమిస్తున్నా. నా స్థాయికి తగిన మనిషి కాదు.. నాకంటే చిన్నవాడు. నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, కుక్కలు మొరుగుతున్నాయని పట్టించుకోలేదని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లుగా మేం రైతుల కోసం చేస్తున్న కృషిని దెబ్బతీసేలా, రైతులను తప్పుదోవపట్టించేలా వ్యవహరిస్తుండడంతోనే స్పందించాల్సి వస్తోందని అన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని విమర్శించారు. రాష్ట్రంపై కేంద్రం పెత్తనం ఏందని నిలదీసే కేసీఆర్ మళ్లీ, ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని అంటారని ఎద్దేవా చేశారు. వరి కొంటామని అగస్టు 31వ తేదీనే కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని కానీ, లేఖ రాయలేదని కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు చట్టాల విషయంలో కూడా కేసీఆర్ పూటకో మాట మాట్లాడారని బండి సంజయ్ అన్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద స్కాం చేశారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీకి వెళ్తే కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోరని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్యానించారు. లీటర్ పై కేంద్రానికి రూ. 27 వస్తే రాష్ట్రానికి రూ. 28 వస్తోందని అన్నారు. కేంద్రానికి వెళ్లే రూ. 27లో రాష్ట్రానికి మళ్లీ రూ. 12 తిరిగి వస్తాయని చెప్పారు. తన మెడ నరుకుతాననని కేసీఆర్ అన్నారని… ఎప్పుడు నరుకుతారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తనకు ఇంగ్లీష్, హిందీ రాదని కేసీఆర్ అన్నారని.. తాను పేద ప్రజల మనసులోని బాధలను, కష్టాలను చదువుకున్నానని చెప్పారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒక రోజు కచ్చితంగా జైలుకు పోకతప్పదని.. ఆయన చేసిన అవినీతే ఆయనను జైలుకు పంపిస్తుందని అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిపై ఆధారాలు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తామని చెప్పారు. కేసీఆర్ కు మతిమరుపు ఎక్కువైందని.. సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడం బెటర్ అని చెప్పారు. హుజూరాబాద్ లో సర్వశక్తులను ఒడ్డినా, కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఓటమిపాలు కావడాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని అర్వింద్ అన్నారు.