ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ఫిర్యాదు

0
752

ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్‌ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలతో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు ద్రౌపది ముర్ము దాఖలు చేశారు.

ఇక ఎన్నో విషయాలపై స్పందించే రామ్ గోపాల్ వర్మ.. ద్రౌపది ముర్ము గురించి కూడా ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు ఏకంగా కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్మును ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్‌పై బీజేపీ నాయకులు ఫైర్‌ అయ్యారు. అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్‌ పోలీసులను కోరారు. మహిళ పట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన సందర్భంగా ‘ద్రౌపది రాష్ట్రపతి ‘ అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ కామెంట్ చేశారని, ఇవి ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు.