గవర్నర్ విషయంలో హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అలాగే వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు సమయం ఉన్నప్పటికీ కావాలనే గవర్నర్ పై కోర్టుకు వెళ్లిందని ప్రభుత్వం పై మండిపడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఫైల్ ఎంతవరకు వచ్చిందో శాసనసభ స్పీకర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటిని పక్కనపెట్టి.. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. కేసీఆర్ కుటుంబం తెలంగాణకు రాజు లెక్క వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర గవర్నర్ను బద్నాం చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందునే ఎంపీ అర్వింద్ పై ప్రభుత్వం కక్ష కట్టిందని బండి ఆరోపించారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. కేంద్రానికి తెలంగాణ నుంచి రూ.3.68 లక్షల కోట్లు ఇచ్చామని, కానీ కేంద్రం నుంచి తెలంగాణకు అందింది తక్కువేనని కేటీఆర్ అంటున్నారని అన్నారు. రాజీనామా చేస్తానని కేటీఆర్ అన్నారని, ఆయన ఆ మాట అనగానే ఇందూరు ప్రజలంతా చప్పట్లు కొట్టారని.. ఆయన చెల్లిని ఓడించిన ఇందూరు ప్రజలు ఆమె రాజకీయ జీవితాన్ని ఖతం చేశారని, ఇప్పుడు ఆయన రాజీనామా అనగానే ఇందూరు ప్రజలకు మరింత సంతోషం కలిగిందని అరవింద్ చురకలు అంటించారు.