ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షలను విధించడం పట్ల ఏపీ బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. విధించిన ఆంక్షలను తొలిగించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెల్లంపల్లి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. ప్రభుత్వ సొమ్ముతో చర్చిలు కట్టిస్తూ, వక్ఫ్ బోర్డు ఆస్తులకు ప్రహరీ గోడలు నిర్మిస్తూ, పాస్టర్లకు, ఇమామ్ లకు, మౌజంలకు జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. మతతత్వ వాదులు ఎవరు? మీరా… మేమా? సనాతన పవిత్ర హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడుతున్న మేం మతతత్వ వాదులమా? వెల్లంపల్లి నోటికొచ్చినట్టు మాట్లాడం మానుకోవాలని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ ఊసరవెల్లి వేషాలను విఘ్నేశ్వరుడితో పాటు సమస్త హిందూ ప్రజానీకం గమనిస్తూనే ఉంది అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేతలు నిర్వహించే కార్యక్రమాలకు వేలాది మంది తరలివస్తే రాని కరోనా.. ప్రజలు వినాయక చవితి చేసుకుంటే మాత్రం వస్తుందా? అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు.. మీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు వేల మందితో జగనన్న అద్దాల మహల్ ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తే కరోనా రాదా సార్?’ అని ఆయన నిలదీశారు. ’20 మంది హిందూ యువకులు వీధిలో వినాయకుడిని పూజిస్తే మాత్రమే వస్తుందా? మీ వాళ్లు ఏమైనా కరోనా రహిత కార్యకర్తలా?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తల ర్యాలీకి సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ నేత, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుపై మండిపడ్డారు. గణేశ్ ఉత్సవ నిర్వహణపై చిత్తూరు జిల్లా ఐరాల ఎస్సై విడుదల చేసిన నోటీసులను తాను ఓ టీవీ చానల్ డిబేట్ లో ప్రదర్శిస్తే, మల్లాది విష్ణు తమపై తీవ్ర విమర్శలు చేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆ నోటీసులను బీజేపీ నేతలు ఎక్కడో తయారు చేసుకుని తీసుకువచ్చి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మల్లాది విష్ణు కొట్టిపారేశారని వివరించారు. ఇవాళ అదే ఐరాల ఎస్సైని గణేశ్ ఉత్సవాల నిబంధనల పత్రం విడుదల చేశాడన్న కారణంగా సస్పెండ్ చేసినట్టు చిత్తూరు జిల్లా పోలీసులు వెల్లడించారు. మల్లాది విష్ణు దీనికేం సమాధానం చెబుతారు? మేం చూపించిన వాస్తవాలను తప్పు అని చెబుతూ, మాపై బెదిరింపులకు పాల్పడిన మల్లాది విష్ణు యావత్ హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. వినాయక చవితికి కరోనా నిబంధనలు వర్తింపజేయడం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ కార్యక్రమాలకు కరోనా నిబంధనలు అడ్డురావా? సంస్మరణ సభకు కరోనా లేదా? అని నిలదీశారు. విపక్షాలు నిరసనలు చేస్తే కరోనా కేసులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.