అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేత సత్యకుమార్ కారుపై అమరావతి ప్రాంతంలో రాళ్ల దాడి జరిగింది. రైతుల దీక్ష శిబిరం నుంచి సత్య కుమార్ తుళ్లూరులో బీజేపీ కార్యకర్తలను కలిసేందుకు వెళుతుండగా, ఉద్ధండరాయునిపాలెం వద్ద ఆయన కారును ఆందోళనకారులు అడ్డుకున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పక్కా పథకం ప్రకారం తనపై దాడి జరిగిందని సత్యకుమార్ వెల్లడించారు. తన కారుపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. కారుపై దాడి చేస్తుంటే చూస్తూ ఉన్నారేంటని తాము ప్రశ్నిస్తే, తమ వాళ్లనే పోలీసులు నెట్టివేశారని సత్యకుమార్ ఆరోపించారు. దాడిపై డీఎస్పీ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇలాంటి దాడులకు ఏపీ సీఎం జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పలికేందుకు వచ్చిన బీజేపీ నేత సత్యకుమార్ వాహనంపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. కారుపై వైసీపీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. పక్కా ప్రణాళికతోనే వైసీపీ గూండాలు దాడి చేసినట్టు అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ దాడిని ఖండించారు. రాజధాని రైతులకు మద్దతిస్తే దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి సరికాదని తెలిపారు. ఈ దాడి ఘటనను బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించాలని, దాడి ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ తెలిపారు. వైసీపీ దౌర్జన్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.
ఏఎస్పీ అనిల్ కుమార్ మాత్రం దాడి జరిగిన వెంటనే సకాలంలో స్పందించామని అన్నారు. బందోబస్తులో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్లే ఎలాంటి విపరీత పరిణామాలు చోటుచేసుకోలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహించామని తెలిపారు. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారని అన్నారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్న అంశంపై న్యాయ సలహా తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు. దీనిపై కేంద్రం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.