జమ్మూకాశ్మీర్లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారతీయ జనతా పార్టీ నేతను కాల్చి చంపారు. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ రాకేష్ పండిత ను త్రాల్ ప్రాంతంలో తీవ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉలిక్కిపడింది. దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాకేష్ పై తీవ్ర వాదులు కాల్పులు జరిపారు. స్థానికులు స్పందించి ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ఓ స్నేహితుడిని కలవడానికి రాకేష్ పండిత వెళ్లిన సమయంలో మాటు వేసిన ముష్కరులు అతడిపై తూటాల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో రాకేష్ స్నేహితుడి కుమార్తెకు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఆమెను పుల్వామా లోని ఆసుపత్రికి తరలించారు

ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ కాశ్మీర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ ఘటన బుధవారం సాయంత్రం సమయంలో చోటు చేసుకుందని అన్నారు. ముగ్గురు తీవ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విజయ్ కుమార్ వెల్లడించారు. తీవ్రవాదుల దాడిలో రాకేష్ పండితా మరణించగా.. రాకేశ్ స్నేహితుని కుమార్తె తీవ్రంగా గాయపడిందని.. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు.
రాకేష్ కోసం ఇద్దరు భద్రతా సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. కానీ రాకేష్ స్నేహితుడిని కలవడానికి వెళుతున్నందుకు భద్రతా సిబ్బందిని తీసుకుని వెళ్లలేదు. దీంతో ఇదే అదునుగా భావించిన తీవ్రవాదులు రాకేష్ మీద కాల్పులు జరిపారు. మా సొంత ఊరు వెళ్తున్నాను.. అక్కడ కూడా ప్రత్యేక భద్రత నాకు వద్దు అని రాకేష్ అధికారులతో తెలిపారట. రాకేష్ పై కాల్పులు జరిపిన అనంతరం తీవ్రవాదులు దాక్కుని ఉన్న ప్రాంతాలలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులుగా లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ప్రకటించుకుంది. ‘పీపుల్ యాంటీ ఫేసిస్ట్ ఫ్రంట్’ ఈ ఘటనకు బాధ్యులమని తెలిపింది.

రాకేష్ మరణంపై పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రవాదుల ఆటలు ఇంకెన్ని రోజులో సాగవని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనను ఖండించారు. కౌన్సిలర్ రాకేష్ ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నానని అన్నారు. పలువురు బీజేపీ నేతలు కూడా ఈ ఘటనను ఖండించారు.
