కొనసాగుతున్న రాజకీయ హత్యలు.. బీజేపీ యూత్ వర్కర్ ను కాల్చి చంపేశారు

0
761

పశ్చిమ బెంగాల్ లో రాజకీయ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులను టార్గెట్ చేసిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో అక్టోబర్ 17 ఆదివారం నాడు ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని ఇటాహార్‌కు చెందిన మిథున్ ఘోష్ అనే యువకుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. రాజ్‌గ్రామ్ గ్రామంలో తన ఇంటి బయటనే హత్య చేయబడ్డాడు. ఘోష్ ఇంటి ముందుకు ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ ద్వారా వచ్చి కాల్చి చంపారు. ఈ దాడి వెనుక తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఉన్నారని బీజేపీ ఆరోపించింది.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ యువ కార్యకర్త హత్యను ఖండిస్తూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ట్వీట్ చేశారు. మిథున్ ఘోష్ హత్యను పార్టీ మర్చిపోదని అన్నారు. “BJYM VP ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా. మిథున్ ఘోష్‌ను ఇటాహార్ వద్ద దుండగులు కాల్చి చంపారు. ఇది మొత్తం తృణమూల్ కాంగ్రెస్ పని ” అని ఆయన తెలిపారు.

నివేదికల ప్రకారం.. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఘోష్ రాజ్‌గ్రామ్ గ్రామంలో తన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. బైక్‌లో వచ్చిన ఇద్దరు దుండగులు అతడిని కాల్చారు. ఘోష్ ను రాయగంజ్ఆసుపత్రికి తరలించారు. అయితే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతని కడుపులోకి అనేక బుల్లెట్లు వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు. తన సోదరుడిని సుకుమార్ ఘోష్, సంతోష్ మహతోలు చంపారని మృతుడి సోదరుడు అజిత్ ఘోష్ చెప్పుకొచ్చారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలో చావుబ్రతుకుల్లో ఉన్న మిథున్ ఘోష్ తనకు పేర్లు ఇచ్చాడని పోలీసులకు తెలిపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడు బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రదీప్ సర్కార్. తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న గూండా ఖాసిం అలీనే ఈ ఘటనకు బాధ్యుడని ఆరోపించాడు. ఘోష్‌పై గతంలో కూడా ఒకసారి దాడి జరిగిందని కూడా ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పశ్చిమ బెంగాల్ పోలీసులు చెప్పినప్పటికీ.. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.