భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ ఓ ఉగ్రవాది అని, దాదాపు 700 మంది రైతుల మరణానికి ఆయనే కారణమని బీజేపీ నేత, మాజీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్ ఆరోపించారు. టికాయిత్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు వల్ల ఖలిస్థాన్ గూండాలకు లబ్ధి చేకూరనున్నదని తెలిపారు.
సోషల్ మేడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. ఘోసీ లోక్‌సభ మాజీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్ మాట్లాడుతూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో 700 మంది రైతుల మరణానికి టికాయత్ కారణమని పేర్కొన్నాడు. అతనిపై కేసు నమోదు చేసి, చనిపోయిన రైతుల బంధువులకు పరిహారం చెల్లించడానికి అతని ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళనలో 700 మంది రైతులు చనిపోయారని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. టికాయత్ సహా నిరసన తెలుపుతున్న రైతు నాయకులు ఉగ్రవాదులు అని రాజ్‌భర్ అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 700 మంది రైతుల మృతికి రాకేష్ టికాయత్ కారణమని, అతడిపై కేసు నమోదు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకుని మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం వల్ల రైతులకు పెద్ద నష్టం చోటు చేసుకుందని.. ఖలిస్తానీ గుండాలకి లాభం చేకూర్చిందని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అనువైన వైఖరిని రైతు నాయకులు అనవసరంగా దుర్వినియోగం చేసుకున్నారని ఆయన అన్నారు.
రైతు చట్టాలను గతేడాది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే కొందరు కావాలనే వీటిపై అపోహలు సృష్టించారు. దీంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఉద్యమం చేశారు రైతులు. రైతు ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం ఇటీవలే రైతు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఇటీవలే రైతు చట్టాల రద్దుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.