బీజేపీ నాయకుడిని దారుణంగా కొట్టిన మహారాష్ట్ర పోలీసులు

0
845

మహారాష్ట్రకు చెందిన పోలీసులు ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అతడు చేతులు జోడించి వేడుకుంటున్నా కూడా సదరు పోలీసులు పట్టించుకోలేదు. కట్టెలు, రాడ్లతో ఇష్టం వచ్చినట్లు కొట్టేశారు. అతడు నొప్పికి తాళలేక కాళ్ల మీద పడుతున్నా కూడా పోలీసులు కనికరం చూపించలేదు. దివ్య మరాఠీ మీడియా సంస్థ కథనం ప్రకారం ఈ ఘటన జల్నా లోని ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 9, 2021న ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ లోకల్ లీడర్ అయిన శివరాజ్ నారియల్వాలేను పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారు.

లోకల్ మీడియా కథనం ప్రకారం ఏప్రిల్ 9 న ఈ ఘటన చోటు చేసుకుంది. శివరాజ్ నారియల్వాలే జల్నా జిల్లాలో బీజేపీ యువ మోర్చా జనరల్ సెక్రెటరీగా ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యువకుడు చికిత్స తీసుకుంటూ ఉండగా ప్రాణాలను కోల్పోయాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆ యువకుడు చనిపోయాడని బంధువులు ఆరోపించారు. శివరాజ్ మరికొంత మంది కలిసి.. ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ఆసుపత్రి సిబ్బందితో చనిపోయిన యువకుడి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

విషయం తెలుసుకున్న జల్నా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుధీర్ ఖిరాద్కర్, ఇన్స్పెక్టర్ ప్రశాంత్ మహాజన్ మరికొందరు సిబ్బందితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులను శాంతిపజేయడానికి ప్రయత్నించగా వాళ్ళు వెనక్కు తగ్గలేదు. దీంతో పోలీసులు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఇంతలో బీజేపీ నేత శివరాజ్ తన మొబైల్ ఫోన్ ను తీసి రికార్డు చేయడం మొదలు పెట్టాడు. దీంతో పోలీసుల దృష్టి శివరాజ్ మీద పడింది. వీడియో రికార్డు చేస్తున్న శివరాజ్ ను పోలీసులు ఆసుపత్రి లోనికి తీసుకుని వెళ్లారు. అక్కడే అతడిని బెల్ట్ తోనూ, కట్టెలతోనూ, రాడ్లతోనూ కొట్టడం మొదలు పెట్టారు. ఇష్టమొచ్చినట్లుగా పోలీసులు అతడిని బాదారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియోను రికార్డు చేశారు. రెండు నెలల కిందట చోటు చేసుకున్న ఘటన అయినప్పటికీ పోలీసుల భయంతోనూ, బెదిరింపుల కారణంగా శివరాజ్ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు.. పోలీసు ఉన్నతాధికారులకు పిర్యాదు చేయలేదు.

https://youtu.be/UrqYWHB_8MQ

ఇటీవలే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుధీర్ ఖిరాద్కర్ లంచం ఆరోపణలతో సస్పెండ్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో శివరాజ్ కు ధైర్యం వచ్చింది. ఈ వీడియోను మీడియాకు ఇచ్చాడు. తన మీద పోలీసులు విచక్షణ లేకుండా కొట్టిన విషయం గురించి అందరికీ చెప్పడానికి ముందుకు వచ్చాడు. దివ్య మరాఠీ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆ వీడియోలో ఉన్నది తానేనని చెప్పుకున్నాడు. ఏప్రిల్ 9, 2021న నన్ను పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని వెల్లడించాడు. పై స్థాయిలో ఉన్న పోలీసులు కూడా తనను కొట్టారని శివరాజ్ వెల్లడించాడు. అందరూ కలిసి నన్ను కొడుతూ ఉంటే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయానని శివరాజ్ బాధపడుతూ చెప్పాడు. పోలీసులు నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు..పిర్యాదు చేయొచ్చు కదా అని ఎంతో మంది అడిగారని.. అయితే ఉన్నతాధికారులంతా నన్ను కొట్టిన వాళ్ళు అవ్వడంతో భయపడ్డానని.. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి తనదని అన్నాడు. మానసికంగా కూడా ఎంతగానో క్రుంగిపోయానని అన్నాడు. వీడియో బయటకు రాగానే ఎంతో మంది నాకు ఫోన్ చేశారు.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారని తెలిపాడు. తన భయాలన్నీ పోయాయని.. నన్ను కొట్టిన పోలీసులపై కేసు పెట్టబోతున్నానని శివరాజ్ వెల్లడించాడు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here