ఏపీ, తమిళనాడులో పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీ పర్యటనను ఆహ్వానిస్తుంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు స్వాగతించడం లేదని బీజేపీ ఎంపీ, సీనియర్ నేత లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారని, ఇది సబబు కాదన్నారు. రాజకీయాలు, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను సీఎం గుర్తించడంలేదని ఆక్షేపించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేసీఆర్ హాజరవ్వాలని లక్ష్మణ్ కోరారు. దగ్గరుండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని మోదీని అడగాల్సిందిపోయి కార్యక్రమాలకు రాకుండా ఉండటం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నా మోదీ అభివృద్ధి పనులను చేపడుతున్నారని.. ఆయన పర్యటనను అడ్డుకుంటామని కొంతమంది పేర్కొనడం సిగ్గుచేటన్నారు.