More

    తమిళనాడులో బీజేపీ బోణీ.. కన్యా కుమారిలో సూపర్ విక్టరీ

    తమిళనాడులో మంగ‌ళవారం నాడు వెలువ‌డిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చూపించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా కన్యాకుమారి జిల్లాలో కాషాయ పార్టీ మెజారిటీ వార్డులను గెలుచుకుంది. తమిళనాడులో 2011లో జరిగిన గత ఎన్నికలతో పోల్చితే, ఈసారి పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీ దక్కించుకున్న వార్డుల సంఖ్యను పెంచుకోగలిగింది. రాత్రి 7.50 గంటల నాటికి బీజేపీ 22 కార్పొరేషన్ వార్డులలో విజయం సాధించింది. 56 మున్సిపాలిటీ వార్డులు, 230 పట్టణ పంచాయతీ వార్డులలో విజయం సాధించింది. 2011లో నాలుగు కార్పొరేషన్‌ వార్డులు, 37 మున్సిపాలిటీ వార్డులు, 185 టౌన్‌ పంచాయతీ వార్డులను గెలుచుకున్నారు.

    పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనేక స్థానాల్లో విజయం సాధించడం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో తమ ప్రస్థానం మొదలైందనే సూచనను ఇస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాగర్‌కోయిల్ కార్పొరేషన్‌లో ఆరు వార్డులు, బవానీసాగర్, సత్యమంగళం ఎంసీల్లోని కొన్ని వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. చెన్నైలో ఆసక్తికరంగా అన్నాడీఎంకే కంటే కొన్ని వార్డుల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. చెన్నైలో కనీసం 5 వార్డుల్లో అన్నాడీఎంకేను వెనక్కి నెట్టి బీజేపీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 174వ వార్డులో డీఎంకే అభ్యర్థి రాధిక 4960 ఓట్ల తేడాతో గెలుపొందగా, బీజేపీ 1847 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, అన్నాడీఎంకే 1403 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. కన్యాకుమారి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులకు 12 చోట్ల బీజేపీ విజయం సాధించింది.

    చెన్నై కార్పొరేషన్‌లోని 134వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి ఉమా ఆనందన్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. తిరునల్వేలిలోని పనగుడి పట్టణ పంచాయతీలోని నాలుగో వార్డులో కూడా బీజేపీ అభ్యర్థి లక్కీ డ్రా ద్వారా గెలిచినట్లు సమాచారం. ఏఐఏడీఎంకే, బీజేపీ అభ్యర్థులు 266 ఓట్లు సాధించడంతో లక్కీ డ్రా పద్ధతిలో విజేతను ఎన్నుకోవాలని నిర్ణయించారు. డ్రాలో బీజేపీ అభ్యర్థి మనువేల్‌ను విజేతగా ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 649 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్‌బిలు)లోని 12,838 స్థానాల్లో దాదాపు 43% స్థానాల్లో బీజేపీ 5,480 మంది అభ్యర్థులను నిలబెట్టింది.

    జనవరి 31న అన్నాడీఎంకేతో సీట్ల పంపకాల చర్చల సమయంలో ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై ప్రకటించారు. “బీజేపీ వేగంగా అభివృద్ధి చెందుతున్న పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా కేంద్ర ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు చాలా మంది పార్టీలో ఉన్నారు. మా కార్యకర్తల మాట వినాలనే నిర్ణయం రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకున్నారు. మేము పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించాలనుకుంటున్నాము. అదే సమయంలో అన్నాడీఎంకే లాంటి పెద్ద పార్టీకి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ కారణంగా మేము చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాము. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది” అని అన్నామలై అన్నారు. ఇది జాతీయ స్థాయిలో కొనసాగే పార్టీల మధ్య పొత్తుపై ప్రభావం చూపదని ఆయన తెలిపారు.

    Trending Stories

    Related Stories