More

    బెంగాల్ బీజేపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు

    ఎన్నికల తేదీలు ప్రకటించడంతో… బెంగాల్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ర్యాలీలతో హోరెత్తించిన బీజేపీ…, తృణమూల్ కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్ కూటమి పార్టీల నేతలు… ఇప్పుడు పోటీలోకి దింపే అభ్యర్థుల జాబితాపై కసరత్తులు మొదలు పెట్టారు.

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కోర్ కమిటీ భేటీ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బెంగాల్ బీజేపీ ఇన్ చార్జ్ కైలాశ్ విజయ వర్గీయ, బెంగాల్ బీజేపీ నేతలు దిలీప్ ఘోష్, సుబేంధు అధికారి, ముకుల్ రాయ్, రాహుల్ సిన్హా, శివప్రకాశ్ ఈ భేటీలో పాల్గొన్నారు. బెంగాల్ లోని నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల జాబితాను వీరు వడపోస్తున్నట్లు సమాచారం. అటు ఈ భేటీ కంటే ముందే… బెంగాల్ బీజేపీ నేతలు… అభ్యర్థుల జాబితాపై భారీగానే కసరత్తు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తృణమూల్ నుంచి వలస వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు… పార్టీ కోసం అకింతభావంతో పనిచేసే నాయకులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మూడు నుంచి నలుగురు పేర్లతో  జాబితాను రూపొందించారనే ప్రచారం జరుగుతుంది.

    అయితే  బెంగాల్ కు సంబంధించినంత వరకు… నియోజకవర్గాల వారిగా గెలిచే అవకాశాలున్న అభ్యర్థులపైనే బీజేపీ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీని కోసం ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దానిపై అంతర్గతంగా సర్వే కూడా చేయించారని… కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

    కోర్ కమిటీ సమావేశం అనంతరం… బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరిగింది.ఈ భేటీలో తుది జాబితాను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి దశ నామినేషన్ల దాఖలుకు మార్చి 9వ తేదీ చివరి తేదీ కావడంతో.. మొదట 30 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం ఏ క్షణమైన విడుదల చేసే అవకాశం ఉంది.

    మరోవైపు ప్రధాని మోదీ ప్రచార సభలపై బీజేపీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. బెంగాల్ లో ఈసారి ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి దశలో… పీఎం మోదీ రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు.  అంతేకాదు బెంగాల్ లోని కార్మికులను ఆకర్షించేందుకు మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అది జనప నారకు కనీస మద్దతును మరింతగా పెంచింది. బెంగాల్ లో 60కి పైగా జనప నారా మిల్లులు ఉన్నాయి. వేలాది మంది కార్మికులు  ఈ మిల్లుల్లో పనిచేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ… ప్రస్తుతం ఉన్న మద్దతు ధరకు అదనంగా ఏడు శాతం ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం.. జనపనార కు కనీస మద్దతు ధరను పెంచడం ఇది రెండోసారి. క్వింటాల్ కనీస మద్దతు ధర… 3,700 రూపాయలుండగా…, 2019లో ఏకంగా 3,950 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏడోవ తేదీన కలకత్తాలో నిర్వహించే… బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు.

    అలాగే… పీఎం మోదీ పాల్గొనే సభలో… భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొంటారనే ప్రచారం బెంగాల్ అంతటా జోరుగా సాగుతోంది. అయితే దీనిపై అటు సౌరవ్ గంగూలీ కానీ… ఇటు స్టేట్ బీజేపీ నేతలు కానీ క్లారిటీ ఇవ్వలేదు. మొదటి దశలో 30 నియోజకవర్గాలు… మార్చి 27వ తేదీన పోలింగ్ జరగనుంది.

    Related Stories