ఐదు రాష్ట్రాల ఎన్నికల నగరా మోగడంతో భారతీయ జనతా పార్టీ స్పీడ్ ను పెంచింది. కేరళతోపాటు, తమిళనాడు, పుదుచ్చేరిలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును రెండు, మూడు రోజుల్లో ఓ కొలిక్కి తెచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే తమిళనాడుకు సంబంధించి సీట్ల సర్దుబాటు వ్యవహారాలపై అధికార ఏఐడీఎంకే తో చర్చించేందుకు.., పార్టీ తరపున కేంద్రమంత్రులు…కిషన్ రెడ్డి, వీకే సింగ్ లను నియమించింది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్..తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం, అలాగే కో కన్వీనర్..ఉప ముఖ్యమంత్రి పళని స్వామిలతో ఇద్దరు నేతలు చర్చించడం జరిగింది. వీరి భేటీకంటే ముందు తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మురుగన్ తో కూడా కిషన్ రెడ్డి, వీకే సింగ్ లు…బీజేపీ పోటీ చేయబోయే నియోజకవర్గాల గురించి చర్చించడం జరిగింది.
ప్రస్తుతం తమిళనాడులో ద్రావిడవాదానికి దీటుగా.., హిందుత్వవాదం కూడా వినిపిస్తోందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ద్రావిడవాదానికి ట్రేడ్ మార్క్ గా ఉన్న కరుణానిధి, జయలలిత అస్తమయం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతోపాటు… ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని చెబుతున్నారు. అలాగే… బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మురుగన్ నిర్వహించిన సుబ్రమణ్యం స్వామి ఆయుధమైన వెట్రివేల్ యాత్రకు.., తమిళ ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. అలాగే ప్రజల్లో పలుకుబడికలిగిన నేతలు…సినిమా స్టార్లు, క్రికెటర్లు సైతం బీజేపీలో చేరడం కూడా కమలం పార్టీకి కలిసివస్తుందని భావిస్తున్నారు.
దీనికితోడుగా గత ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ ఓట్లు పోలైన నియోజకవర్గాలను గుర్తించిన బీజేపీ అధిష్ఠానం…, ఆయా నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఆయా నియోజకవర్గాలకు పార్టీ తరపున ఇన్ చార్జీలను నియమించింది. ఆయా నియోజకవర్గాల్లో నిరంతర ప్రచార కార్యక్రమాలు.., కార్నర్ మీటింగ్ లు ఆర్గనైజ్ చేసింది. అటు అంతర్గతంగా కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి… గెలుపు ఓటములపై సర్వేలు జరిపించినట్లు తెలుస్తోంది. మొత్తంగా తమిళనాడులో ఈసారి బీజేపీ 60 స్థానాలకు పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ తన బృందంతో కలిసి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని…అమిత్ షాకు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అన్నాడీఎంకే సమన్వయ కమిటీ మాత్రం బీజేపీకి 60 సీట్లు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. బీజేపీని 21 సీట్లకే సర్దుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి బీజేపీ నేతలు ససేమిరా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ కూటమిలోని పీఎంకేకు..అన్నాడీఎంకే 23 సీట్లు కేటాయించింది. తమిళ మానిల కాంగ్రెస్ కు సైతం సింగిల్ డిజిట్ సీట్లేని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా 234 సీట్లకు గాను అన్నాడీఎంకే 170 సీట్లల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇక మిగిలిన సీట్లు 64. అందులో పీఎంకేకు 23, డీఎండీకేకు 10, టీఎంసీకి 5 కేటాయించగా మిగిలేవి 26 సీట్లు మాత్రమే. ఈ మిగిలిన 26 సీట్లే బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని కొంతమంది పరిశీలకులు చెబుతున్నారు.
అయితే డీఎండీకే పార్టీ కోశాధికారి ప్రేమలత విజయ్ కాంత్… అన్నాడీఎంకే తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఆమె… అన్నాడీఎంకే కూటమి నుంచి నిష్క్రమించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు ఆమె పావులు కదుపుతున్నారని కొంతమంది అంటున్నారు.
ఇటు బీజేపీ… కూడా అంతిమంగా…40 స్థానాల వరకైతే అన్నాడీఎంకేకు ఓకే చెప్పే చాన్స్ ఉందని మరోక ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీట్ల సర్దుబాటు వ్యవహారాలను పక్కన పెడితే…, అమిత్ షా… తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేలా..ఆయా రాష్ట్ర శాఖలకు దిశానిర్దేశం చేశారని అంటున్నారు. అయితే కమలం పెద్దల వ్యూహం ఎంత వరకు ఫలిస్తుంది. అన్నాడీఎంకే ఎంత వరకు దిగివస్తుందన్నది తెలియాలంటే… జస్ట్ వెయిట్ అండ్ సీ.!