తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో బీజేపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచే బరిలోకి దిగనున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో ఇప్పటికే పలు మార్లు చర్చించిన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ సమావేశమై ఓ అవగాహనకు వచ్చారు.
తిరుపతి ఉప ఎన్నికల బరిలో ఉమ్మడి అభ్యర్థి బీజేపీ నుంచీ పోటీకి దిగేలా అంగీకారానికి రావడంతో.. ఆ వెనువెంటనే బీజేపీ ఏపీ ఇంఛార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఇదే విషయమై ప్రకటన కూడా జారీ చేశారు.
దీంతో ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ ఎవరిని పోటీకి నిలుపుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. పార్టీ పరిశీలనలో ప్రధానంగా నలుగురి పేర్లు వున్నాయని, అందులో ముగ్గురు ఉన్నతాధికారులుగా పనిచేసి రిటైరైన వారు కాగా ఒకరేమో స్థానిక నేతగా చెబుతున్నారు. ఆ నలుగురిలో రిటైర్డు ఐఏఎస్
అధికారులు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ, రిటైర్డు డీజీపీ కృష్ణప్రసాద్ వుండగా మరొకరు తిరుపతి బీజేపీ నేత మునిసుబ్రమణ్యంగా ప్రచారం జరుగుతోంది .
తిరుపతి ప్రధానంగా విద్యా కేంద్రం కావడంతో ఇక్కడ ఉన్నత విద్యావంతులు ఎక్కువ. అలాగే నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలోనూ విద్యావంతులు అధికంగా వుంటున్నారు. ఈ కారణంగానే ఇక్కడ ఏ పార్టీ అయినా విద్యాధికులనే అభ్యర్థులుగా ఎంచుకుంటున్నాయి.
తిరుపతి లోక్‌సభ ఎన్నికల చరిత్ర చూస్తే టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచీ ప్రధాన పార్టీలన్నీ ఉన్నత విద్యావంతులకే టికెట్లు కేటాయిస్తున్నాయి. ఆ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ తరపున ఎంపీగా పలుమార్లు గెలిచిన చింతా మోహన్ సైతం వైద్యుడు. తర్వాత బీజేపీ రిటైర్డు ఐఏఎస్ అధికారి వెంకటస్వామికి టికెట్
కేటాయించింది. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసినపుడు గెలుపొందిన ఆయన బీజేపీ తరపున ఒంటరిగా పోటీ చేసినపుడు ఓటమి చెందారు.
తర్వాత 2014లో వైసీపీ సైతం రిటైర్డు ఐఏఎస్ అధికారి వరప్రసాద్‌కు టికెట్ ఇవ్వగా ఆయన గెలిచారు కూడా. తాజాగా బీజేపీ పరిశీలనలో వున్న నలుగురిలో కూడా ముగ్గురు రిటైర్డు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే. వీరిలో దాసరి శ్రీనివాసులు పేరు కొద్ది నెలల నంచీ ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల ఈయనతో పాటు రత్నప్రభ, కృష్ణప్రసాద్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి.
నియోజకవర్గ ఓటర్లకు, ముఖ్యంగా పార్టీ శ్రేణులకు పరిచయమున్న అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి వస్తే ఆ కేటగిరీ కింద రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ముని సుబ్రమణ్యం పేరును జాబితాలో చేర్చినట్లు తెలిసింది.ఆయన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో రిజిస్టర్డ్ కాంట్రాక్టరుగా వున్నారు. ఆర్థికంగా మరీ బలవంతుడు కాకపోయినా పర్వాలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వుందని అంటున్నారు.
అయితే రాష్ట్ర పార్టీ నుంచీ జాతీయ కమిటీకి 27 పేర్లు వెళ్ళగా వడపోతల్లో ఈ నలుగురూ మిగిలారని చెబుతున్నారు. ఈ నలుగురిలోనే ఒకరు ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దిగుతారని మాత్రం ముఖ్య నేతలు ఖాయంగా చెబుతున్నారు. ఆ ఒక్కరూ ఎవరన్నది మాత్రం తెలియాలంటే మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని అంటున్నారు.