More

    సింగర్ మంగ్లీపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

    తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై సింగర్ మంగ్లీ పాటలను విడుదల చేస్తూ ఉంటారు. బోనాల సీజన్‌లో సింగర్ మంగ్లీ పాటలు ఎక్కడ చూసినా వినిపిస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది బోనాల సమయంలో ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేస్తూ ఉంటారు మంగ్లీ. ఈ ఏడాది కూడా బోనాల స్పెషల్ సాంగ్ విడుదలైంది. అయితే ఈ పాట వివాదంలో ఇరుక్కుంది. జులై 11న మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌‌లో ఈ ఏడాది బోనాల సాంగ్ రిలీజ్ చేశారు. ‘చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా..’ అంటూ సాగే ఈ పాటకు రామస్వామి లిరిక్స్‌ అందించగా.. రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. ఓ వైపు ఈ సాంగ్ యూట్యూబ్‌లో వ్యూస్ పెద్ద ఎత్తున తెచ్చుకుంటూ ఉండగా.. ఈ పాటలో వాడిన కొన్ని పదాల పట్ల తెలంగాణకు చెందిన పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అమ్మవారిని చుట్టంగా, మోతెవరిలా అభివర్ణించడం తప్పని చెబుతున్నారు. అమ్మవారిని చుట్టంలా, మోతెవరిలాగా, అక్కరకు రాని చుట్టంలా అభివర్ణించడం సరికాదని పలువురు నెటిజన్స్ చెప్పారు. ఈ సాంగ్ దేవతని మొక్కినట్టులేదని.. తిడుతున్నట్టుంది అని వెంటనే లిరిక్స్‌ మార్చాలని డిమాండ్స్ మొదలయ్యాయి. అదే విధంగా మంగ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

    ఈ పాటలో వాడిన పదాలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ ఈ పాటపై పోలీసులను ఆశ్రయించింది. ఈ పాట లిరిక్స్ పై అభ్యంతరం తెలుపుతూ బీజేపీ కార్పొరేటర్స్ రాచకొండ పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. హిందువుల మనో భావాలు దెబ్బతీసేలా మంగ్లీ పాటలోని పదాలు ఉన్నాయని తెలియజేశారు. మంగ్లీ పాడిన సదరు పాట వీడియోను అన్ని సామజిక మాధ్యమాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారని సింగర్ మంగ్లీపై బీజేపీ నేతలు మండిపడ్డారు. మంగ్లీపై కేసు నమోదు చేయాలని సీపీని కోరారు. కేసు నమోదుపై సీపీ కార్యాలయం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

    Trending Stories

    Related Stories