వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పాలమూరు జిల్లాలో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా మహబూబ్ నగర్‌లో కాషాయదళం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్‌తో పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా సహా మిగిలిన ఐదు జిల్లాల నుంచి బీజేపీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో సభకు తరలివచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా 21 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి..స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ప్రజలతో మాటామంతి నిర్వహిస్తూ టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు ఎంపీ బండి సంజయ్. యాత్రలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న బండి సంజయ్ జేపీ నడ్డా దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించబోతారో ఈ మీటింగ్ ద్వారా వివరించారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలన వైఫల్యాలను మహబూబ్ నగర్ సభలో ఎండగట్టే ప్రయత్నం చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి మధ్యాహ్నాం 12గంటల 40 నిమిషాలకు చేరుకోన్నారు. నోవాటెల్‌లో భోజనం చేసుకొని..రోడ్డు మార్గం ద్వారా మహబూబ్‌నగర్‌కు బయల్దేరారు. మధ్యాహ్నాం 3 గంటలకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో జేపీ నడ్డా పాల్గొన్నారు. పదాధికారుల సమావేశంలో తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం..పార్టీ భవిష్యత్ కార్యచరణపై రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. మహబూబ్ నగర్‌లో బహిరంగ సభలో జేపీ నడ్డాతో పాటు ఆ పార్టీ కీలక నేతలు మీటింగ్‌లో పాల్గొన్నారు. బహిరంగ సభలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగావేయడమే లక్ష్యంగా మహబూబ్ నగర్ సభను బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికేలా మహబూబ్ నగర్ బహిరంగ సభను సక్సెస్ చేశారు బీజేపీ శ్రేణులు.